ఎమ్బీయస్‍: టిడిపి కిరికిరి – జనసేన హరాకిరి

హరాకిరి జపాన్‌లో మధ్యయుగాలలో వాడుకలో ఉండేది. జపనీస్ యోధుడు (సమురై) కత్తితో తన పొట్ట తనే చీల్చుకుని, పేగులు బయటకు పడేసి ఆత్మహత్య చేసుకోవడాన్ని హరాకిరి లేదా సెప్పుకు అంటారు. శత్రుసైనికులకు దొరికిపోయి, అవమానం పాలవడం కంటె యీ రకమైన ఆత్మహత్య గౌరవప్రదమని వారి భావన. కొందరు భూస్వామ్య ప్రభువులు (డైమ్యో) తమ వద్ద పని చేసే యోధులతో ‘‘నా పట్ల విశ్వాసం ప్రకటించడానికి హరాకిరి చేసుకో.’’ అని ఆజ్ఞాపించేవారు కూడా. అత్యంత భీకరమైన విశ్వాస ప్రకటనామార్గాన్ని సూచించే యీ పదం ఇంగ్లీషు భాషలోకి కూడా చొరబడింది. వైసిపిని ఎదిరించడానికి టిడిపి-జనసేన-బిజెపి కూటమి ఏర్పరచడానికి పవన్ ఎంతో శ్రమించారు. బిజెపి వద్ద చివాట్లు తిని, అవమానాలు భరించి, చివరకు అనుకున్నది సాధించారు, టిడిపి, బిజెపిలను ఒకింటివారిని చేశారు. కానీ ఆ క్రమంలో హరాకిరి చేసుకున్నారు, సీట్ల సంఖ్య పరంగానే కాదు, యిమేజి పరంగా కూడా!

నిజానికి సీట్ల సంఖ్య పరంగా జరిగే డామేజి తక్కువే. జనసేన ‘హితైషులమంటూ’ కొందరు 40, 50 తీసుకోమని చెప్పినా, చాలా మంది జనసేనకు వచ్చేది 20 ప్లస్ ఆర్ మైనస్ 2 అంటూ వచ్చారు.  ఎమ్బీయస్‍: అనుచరుల ఆరాటం, అధినేతల ఇరకాటం అనే ఆర్టికల్‌లో నేను 2019 నాటి ఓటింగు శాతాలతో లెక్కలు వేసి ‘ఐదు జిల్లాలలో జనసేనకు ఛాన్సు ఉండేవి 21 స్థానాలు, దాన్ని బేస్‌గా చేసుకుని జనసేన బేరాలు మొదలుపెట్టి ఏ 30 దగ్గరో తెగవచ్చు.’ అని రాశాను. చివరకు 21 దగ్గరే తెగింది. అంటే మొత్తం 175 స్థానాల్లో 12% అన్నమాట. పార్లమెంటు స్థానాలు మొత్తం 25 ఉన్నాయి కాబట్టి దానిలో 12% అంటే 3 రావాలి. కానీ అక్కడ ఒకటి కోసేశారు. బిజెపికి 5 యిస్తామంటే కాదు, 6 కావాలని పట్టుబట్టిందని, దాంతో పవన్ నుంచి లాక్కుని దానికి యిచ్చారని అంటున్నారు. ఒకటేగా పోయింది అనకండి, దానికి 7 అసెంబ్లీ స్థానాల విలువుందని పవనే చెప్పారు. అప్పుడు 3X7+24= 45 అయితే, యిప్పుడు 2X7+21 =35 అయింది. అంటే 10 అసెంబ్లీ స్థానాలు తగ్గినట్లన్నమాట.

బిజెపి కూటమిలోకి వస్తానన్నపుడు టిడిపి పెట్టిన కిరికిరి వింతగా ఉంది. జనసేనతో 24-3 ఫార్ములా పెట్టుకున్నట్లే దానితోనూ ఏదో ఒకటి తేల్చుకోవాల్సింది. అలా కాకుండా మీకూ జనసేనకూ కలిపి అమాంబాపతు సంభావన 30-8, దాన్లోనే సర్దుకోండి, తక్కినవన్నీ మాకే అని బేరమాడడమేమిటి? జనసేనతో బేరమాడుకునేటప్పుడు బిజెపి పిక్చర్‌లో లేదు కదా! బిజెపి రాక వలన భారీగా నష్టపోయినది జనసేన! దానికిచ్చిన పార్లమెంటు సీట్లు మూడిటిలో ఒకటి (33%), అసెంబ్లీ స్థానాల్లో 3 (12.5%) ఎగిరాయి. టిడిపికి పార్లమెంటులో పోయినది 0%, అసెంబ్లీలో పోయినది 145లో 1 (0.7%). 1% ఓటింగున్న బిజెపికి 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలైతే అయితే దాదాపు 7% తెచ్చుకున్న జనసేనకు బిజెపికిచ్చిన దాని కంటె 7 రెట్లు ఎక్కువగా యివ్వాలి. ఇవ్వలేదే! అసెంబ్లీలో రెట్టింపు యిచ్చి, పార్లమెంటు విషయంలో మూడోవంతు మాత్రమే యిచ్చారు.

ఈ అంకెలు పవన్‌కు రీజనబుల్‌గానే తోచవచ్చు. కానీ మధ్యలో 24-3 అంకెలు చెప్పి తర్వాత తగ్గించడం మాత్రం అవమానకరంగా ఉంది. 24యే తక్కువ అని ‘హితైషులు’ గోల పెడితే పవన్ వాళ్లను తిట్టిపోయడంతో పాటు 24 అంటే గాయత్రీ మంత్రంలోని అక్షరాల సంఖ్య అంటూ సర్ది చెప్పారు. ఇప్పుడు మరో మంత్రం వెతుక్కుని అన్వయం చెప్పవచ్చు లెండి. కానీ పవన్‌కు ఫైనల్ ఫిగర్స్ గురించి ముందస్తు అవగాహన లేదని జనానికి తెలిసిపోయింది కదా. ‘పగ కోసమే వలలో పడెనే అయ్యో పాపం పసివాడు’ అని జనాలు జాలి పడే స్థితికి నెట్టారు. ఇది దుర్మార్గం. జనసేనకు ప్రాధాన్యత యివ్వడం లోకేశ్‌కు యిష్టం లేదనే మాట మొదట్నుంచి వింటూనే ఉన్నాం. 175లో 150 మావే అని అతను బహిరంగంగా ప్రకటించాడు కూడా. బిజెపి వాళ్లు దిల్లీకి పిలిచారనగానే ఎట్టి పరిస్థితుల్లోనూ 30 దాటనివ్వద్దన్నాడని వార్త వచ్చింది. అదే నిజమైంది. చివరికి 8 గంటల హోరాహోరీ చర్చల తర్వాత లోకేశ్ 1 సీటు కన్సెషన్ యిచ్చారు.

బాబు, పవన్ దిల్లీలో అమిత్ షాను కలిసిన అరగంట లోనే సీట్ల సర్దుబాటు విషయం తేలిపోయిందని టిడిపి అనుకూల మీడియా రాసేసింది. మరి అలాటప్పుడు నిన్న ఎనిమిది గంటల పాటు చర్చలెందుకు జరిగాయో తెలియదు. ఏయే స్థానాలు అనే విషయం గురించా? తను ‘త్యాగ’రాజు కావలసి వస్తుందని పవన్‌కు దిల్లీలోనే తెలిసిపోయిందా? ఇప్పుడు స్థానాల విషయంలో త్యాగచక్రవర్తి కావలసి వస్తుందేమో చూసుకుంటున్నారా? గాయత్రి మంత్రం గుర్తు చేసుకున్న సభలోనే వామనుడి కథా చెప్పారు. మూడు పార్లమెంటు స్థానాలు మాత్రమే తీసుకున్నా రనుకుంటున్నారేమో వామనుడినై జగన్‌ను పాతాళానికి తొక్కేస్తా అన్నారు. వామనుడు తనకు దానమిచ్చినవాణ్ని తొక్కేశాడు. అక్కడ 3 స్థానాలు కేటాయించినది బాబు. తొక్కితే ఆయన్ని తొక్కాలి, మధ్యలో జగన్ ఎక్కణ్నుంచి వచ్చాడు?

ఇప్పుడు కొత్త లెక్కలో తనకు కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లో 3టిని బిజెపికి యిచ్చేసినవాడు పవన్. అంటే మూడడుగులు దానమిచ్చిన బలి చక్రవర్తి లాటి వాడన్నమాట. అతన్ని పాతాళానికి తొక్కే బిజెపి వామనుడన్నమాట.  తెలంగాణలో బిజెపి జనసేనను అలాగే తొక్కింది. చివరి నిమిషంలో పొత్తు అంది. ఒక్క సీటైనా గెలుచుకోలేక పోయిందనే అప్రతిష్ఠ కలిగేట్లు చేసింది. ఇప్పుడు ఆంధ్రలో 24-3 తెచ్చుకుని హమ్మయ్య అనుకుంటే ఆఖరి నిమిషంలో చొరబడి తన వాటాలో కోత పెట్టించింది. ఇలా కోత పెట్టినా, వాత పెట్టినా నిజానికి పవన్‌కు ఏ బాధా లేదు. ఎక్కడికక్కడే.. అనుకుంటాడు. కానీ హితైషులమంటూ కొందరు తయారై వేపుకు తినేస్తున్నారు ‘నువ్వు పవనపుత్రుడివి, నీ బలం నీకు తెలియదు’ అంటూ ఊదరగొట్టేస్తున్నారు. ‘నేను పవనుణ్ని మాత్రమే, నా బలం యింతే, సలహాలతో నన్ను చంపకండి.’ అని అతను ఎంత ప్రాక్టికల్‌గా మాట్లాడినా వాళ్లు వినటం లేదు.

చివరకు హరిరామజోగయ్య కొడుకు, ముద్రగడ వైసిపిలోకి చేరడంతో వాళ్లు యిన్నాళ్లూ యిచ్చిన సలహాలకు విలువ లేకుండా పోయింది. చూశారా, కావాలనే వీళ్లు యాగీ చేశారు అనడానికి పవన్‌కు వీలు చిక్కింది. వైసిపియే యిదంతా చేయించి ఉంటే ముద్రగడ చేరికతో దానికి శిక్ష పడ్డట్లే. రేపణ్నుంచి ఆయన జగన్ పేర లేఖలు రాసి, అల్లరి పెట్టడం ఖాయం. ఎవరి తరఫునైనా ఓట్లు అడగడానికి వెళితే కాపు రిజర్వేషన్ వీలు కాదని చెప్పిన వైసిపికి ఓట్లేయమని ఎందుకడుగుతున్నావ్ అని ఓటర్లు ఆయన్ని అల్లరి పెట్టడం ఖాయం. వైసిపి కనక్షన్ మాట ఎలా ఉన్నా, ముద్రగడ, జోగయ్య కాపు యువతలో ఆలోచనలు రేకెత్తించారు. అసలే వాళ్లకు చంద్రబాబుపై నమ్మకం అంతంతమాత్రం. ఇప్పుడు యిస్తానన్న సీట్లలోనూ కోత పెట్టడంతో అది మరింత అడుగంటి ఉంటుంది. సంతృప్తి విషయంలో జనసేనాని దృక్పథం వేరు, జనసైనికుల దృక్పథం వేరు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను అన్నీ వదులుకుంటున్నాను అని పవన్ చెప్పినా, జగన్‌ను ఓడించడం కోసమే అని దానికి తెలుగు అర్థం. కానీ జగన్‌ను ఓడించవలసిన అవసరం, అగత్యం పవన్ కంటె బాబుకే ఎక్కువ. పవన్‌తో జగన్‌కు ప్రత్యక్షంగా పేచీ లేదు. ఇటీవలి కాలంలోనే యిద్దరూ తలపడ్డారు. బాబు విషయం వేరు. జగన్ తండ్రి కాలం నుంచి బాబు ప్రత్యర్థి. వైయస్ బతికుండగానే పరిటాల రవి హత్య కేసులో జగన్‌పై ఆరోపణలు చేయడం దగ్గర్నుంచి బాబు రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఎన్నో రకాలుగా వేధించారు. దానికి తగ్గట్టుగానే జగన్ తెల్లవారితే చాలు బాబుపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు. అధికారం చేతికి వచ్చాక వేధింపులూ ప్రారంభించారు. కేసులు, ఆయన ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడాలు, ఆయన సన్నిహితులపై రకరకాల దాడులు.. యిలా ఎన్నో! అందుచేత అర్జంటుగా జగన్‌ను గద్దె దింపవలసిన అవసరం బాబుది. దాని కోసం ఆయన అవసరమైతే నాలుగు మెట్లు దిగి, నాలుగు సీట్లు వదులుకుని పొత్తు కుదుర్చుకుని ఎలాగైనా కూటమి ఏర్పడేట్లు చేయాల్సిన అవసరం ఆయనది.

కానీ ఆయన కేవలం 31 సీట్లు (అంటే 18%) మాత్రమే భాగస్వాములకు యిచ్చి 82% తనవద్దే అట్టే పెట్టుకున్నారు. పార్లమెంటు స్థానాలు ఎన్ని ఉన్నా పెద్ద తేడా రాదు. జనసేనకు 3 అసెంబ్లీ తగ్గించాం కాబట్టి పార్లమెంటు స్థానాలు 3 నుంచి 4కి పెంచాం అని ఉంటే పవన్ 4X7+21 =49 అయింది. గతంలో అనుకున్న 45 కంటె 4 ఎక్కువ వచ్చాయి చూశారా అని అనుచరులకు చెప్పుకునే వీలుండేది. అది చేయలేదు సరి కదా, ఉన్న మూడిటిలో ఒకటి తెగ్గోశారు. ఓ సినిమాలో మంచు మనోజ్ సుబ్బరాజుకి రక్తంతో ప్రేమలేఖ రాస్తే ఎఫెక్టివ్‌గా ఉంటుంది అని సలహా యిస్తాడు. వెంటనే అతను పక్కనున్న బ్రహ్మానందం చెయ్యి కోసి, అతని రక్తంతో తన ప్రేమలేఖ రాస్తాడు. అది గుర్తుకు వచ్చింది నాకు.

బిజెపిని సంతృప్తి పరచడం టిడిపికి అవసరం. ఎందుకంటే అర్బన్, అగ్రవర్ణ, ఉన్నత వర్గాల ఓట్లు తమకూ, బిజెపికి మధ్య చీలిపోకుండా చూసుకోవాలి. జనసేనకు బిజెపితో ఆ భయం లేదు. దాని ఓటు బ్యాంకు వేరే! అందుచేత బిజెపిని ఎకామడేట్ చేయవలసినది టిడిపి. కానీ జనసేన చేత చేయించింది టిడిపి. అదీ బాబు టాలెంటు. ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన 10-12% ఓట్లు టిడిపికి యాడ్ చేయగలదన్న అంచనాతోనే బాబు పవన్‌ను దువ్వుతూ వచ్చారు. అలా చేస్తూ వచ్చి యిప్పుడు హఠాత్తుగా యిలా వ్యవహరించడం జనసైనికులకు అన్యాయంగా తోస్తే మాత్రం ఓట్ల బదిలీ కష్టం. మొదటే 21-2 సీట్లు అంటే సరిపోయేది. 24-3 చెప్పి తగ్గించడం అవమానకరంగా ఉందనడంలో సందేహం లేదు.

దీనికి తోడు పవన్ పార్లమెంటుకి వెళతారన్న పుకారు ఒకటి పుట్టించారు. పార్లమెంటుకి పంపడాన్ని రాజకీయ పరిభాషలో కికింగ్ అప్‌స్టయిర్స్ అంటారు. రాష్ట్ర రాజకీయాల్లో చోటు లేకుండా చేయడమన్నమాట. ఇక సగకాలం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ముచ్చట ఉండనే ఉండదు. ఆయన తరఫున అంటూ నాదెండ్ల మనోహర్‌కి ఏదో మంత్రి పదవి యిచ్చేస్తారు. పవన్‌కు కేంద్రమంత్రి పదవి యిస్తారనే పుకారు హాస్యాస్పదం. ఇచ్చిన రెండు ఎంపీ సీట్లూ గెలిచినా, రెండు సీట్లతో మంత్రి ఎలా అవుతారు? అక్కడ మంత్రి అయితే సినిమాల్లో ఎలా నటిస్తారు? పవన్ సినిమాల నుంచి రిటైరయ్యే ఉద్దేశంలో లేరు. పార్లమెంటుకీ, అసెంబ్లీకి రెండిటికి పోటీ చేస్తారన్నా ఆంధ్ర నుంచి తప్పిస్తున్నారని భావన బలపడుతుంది. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే ఓటమి భయం వెంటాడుతోందన్న యింప్రెషన్ కలుగుతుంది. ఇమేజి కాపాడుకోవాలంటే పవన్ ఒక్క అసెంబ్లీ సీటు నుంచే పోటీ చేయాలి. అక్కడ టిడిపి, బిజెపి ఓట్లు బదిలీ చేయించాలి.

కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని పవన్ ఆ మధ్య పిలుపు నిచ్చారు. పెద్దన్న అంటే బాధ్యతలు మోస్తూ త్యాగాలు చేసే పెద్దన్నా? పెత్తనం చలాయించే బిగ్ బ్రదరా? అని నాకు అనుమానం వచ్చింది. ఇప్పటి వరుస చూస్తే త్యాగాల పెద్దన్నే అని అర్థమైంది. కూటమి టిక్కెట్ల పంపిణీలో లాభపడింది టిడిపియే. ఐదేళ్లగా టిడిపి నాయకులు చేసినది లేదు. కరోనా టైములో ఎవరూ కానరాలేదు. బాబు అరెస్టయినప్పుడు అందరూ కలుగుల్లో దాగున్నారు. టిక్కెట్ల పంపిణీ సమయానికి మాత్రం నాకూ, మా అబ్బాయికీ.. అంటూ తయారయ్యారు. నిజానికి కరోనా టైములో జనసేన కార్యకర్తలు కొన్ని చోట్ల బాగా పని చేశారట. వారంతా యిప్పుడు టిక్కెట్ల సమయంలో వెనకబడ్డారు. వైసిపి నుంచి వచ్చినవారు, టిడిపి కోవర్టులు ఎగరేసుకుని పోతున్నారు.

కందుల దుర్గేష్‌కు రాజమండ్రి రూరల్ ఖాయం అనుకున్నారు. ఇంతలో గోరంట్ల తన తడాఖా చూపించారు. కందుల నిడదవోలుకి వెళ్లాల్సి వస్తోంది. ఇలా జనసేన త్యాగసేనగా మారిపోవడం పవన్ అభిమానులకు రుచిస్తుందా? టిడిపి ఒక్కటే కాదు, బిజెపి మాత్రం యిన్నాళ్లూ యాక్టివ్‌గా ఉందా? వాళ్లు చేసిన కార్యక్రమాలేమిటి? వాళ్ల నాయకులు రోడ్లపై తిరిగిన దెక్కడ? కేసులు పెట్టించుకున్నదెక్కడ? ఇప్పుడు మాత్రం 6 ఎంపీ టిక్కెట్లు, 10 అసెంబ్లీ టిక్కెట్లు మాకంటే మాకు అంటూ ఎగబడుతున్నారు. వైసిపి పేక మేడ, ఉఫ్ అని ఊదితే పడిపోతుంది అని కూటమి నాయకులు చెప్తూనే పొత్తు కోసం యింత కసరత్తు ఎందుకు చేస్తున్నారు అనే అనుమానంతో పాటు, త్యాగాల వంతు జనసేనదేనా? అనే బాధ కూడా పవన్ అభిమానులకు కలగడం సహజం. పవన్ ఎంత చాకచక్యంగా మాట్లాడి వారిని ఊరడిస్తారో చూడాలి.

చివరగా ఒక్క మాట – టిడిపి, జనసేన, బిజెపి ఒక కూటమిగా ఏర్పడి వైసిపిని ఎదుర్కోవడం హర్షదాయకమే. ఎవరు గెలిచినా ప్రతిపక్షం బలంగా ఉంటుంది. అది ప్రజాస్వామ్యానికి మంచిది. అయితే బిజెపి కటాక్షవీక్షణానికై తెలుగుదేశం నాయకుడు దిల్లీ వెళ్లడం నాకు రుచించ లేదు. అమిత్ షా అక్కడే ఉంటాడు కదా అంటే రెండు రోజుల్లో హైదరాబాదు వస్తున్నాడు కదా, అక్కడే కలవాల్సింది. పోనీలే అని సరిపెట్టుకున్నా, సీట్ల సంఖ్య తేల్చేటప్పుడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు లేకుండా కేంద్ర బిజెపి పెద్దలే అన్నీ తేల్చేయడం పెత్తందారీతనానికి నిదర్శనం. ఈ దిల్లీ సల్తనత్‌కి వ్యతిరేకంగానే ఎన్టీయార్ పోరాడారు. ఆయన పార్టీని కైవసం చేసుకున్న అల్లుడు ఆయన స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూండగా, ఆయన కూతురు బిజెపిలో చేరి తన అస్తిత్వాన్ని చాటుకోలేక పోతున్నారు. ఇది ఒక విషాదం.

 – ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2024)

mbsprasad@gmail.com