‘కొణతాల’ కు టికెట్ వెనుక ‘త్రివిక్రమ్’!

రాజకీయాల్లో ఏది.. ఎందుకు.. ఎలా.. ఎప్పుడు.. జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎవరి ద్వారానో ఎవరో మరెవరికో పరిచయం అవుతారు. అక్కడ అదృష్టం తిరుగుతుంది. లాటరీ పలుకుతుంది. అనకాపల్లి ఎమ్మెల్యే గా పోటీకి జనసేన టికెట్ ను అందుకున్న మాజీ మంత్రి కొణతాల వైనం ఇలాంటిదే అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదెలా అంటే చిత్రమైన ఈక్వేషన్ వినిపిస్తున్నారు.

నిజానికి గత అయిదేళ్లుగా కొణతాల రామకృష్ణ రాజకీయంగా దాదాపు అజ్ఙాతంలో వుండిపోయారు. స్వతహాగా నెమ్మది, మృదు స్వభావి అయిన కొణతాల వయస్సు, ఆరోగ్యం రీత్యా అస్సలు బయట పెద్దగా కనిపించలేదు. అలాంటిది జనసేన అధిపతి పవన్ ఒక్కసారిగా కొణతాలను కలవడం, పార్టీలోకి ఆహ్వానించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఈ లింక్ ఎక్కడ కుదిరిందా అని. పైగా తెలుగుదేశం కనెక్షన్ కూడా లేదు. కొణతాల జర్నీ అంతా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ తోనే.

విషయం ఏమిటంటే, కొణతాల రామకృష్ణ పేరు పవన్ దృష్టికి తొలి సారిగా బ్రో సినిమా టైమ్ లో వచ్చింది. అదెలా అంటే, ఆ సినిమాకు త్రివిక్రమ్ కు అసోసియేట్ గా పనిచేసారు దర్శకుడు చిన్నికృష్ణ. గతంలో లండన్ బాబులు లాంటి సినిమాను అందించారు. సదరు చిన్ని కృష్ణ ఈ కొణతాల రామకృష్ణకు బాగా సన్నిహిత బంధువు. ఆ విషయం త్రివిక్రమ్ కు తెలిసింది. ఆయన ద్వారా పవన్ కూ తెలిసింది.

బ్రో సినిమా టైమ్ లో త్రివిక్రమ్ కు బాగా దగ్గరయ్యారు. ఆయన మనసు ఎరిగి నడుచుకున్నారు. దాంతో త్రివిక్రమ్ ఆ చిన్ని కృష్ణ ను పీపుల్స్ మీడియాలో కీలక బాధ్యతల్లో వుంచారు. అది వేరే సంగతి. ఎప్పుడయితే కొణతాల గురించి తరచు వినడం, మాట్లాడుకోవడం అలా అలా పవన్ దృష్టి అటు పడింది. పైగా మంచి వాడు, సౌమ్యుడు, తన తల్లి విజయమ్మ విశాఖలో ఓటమి చెందడానికి కారణం కొణతాల అని జగన్ కోపం పెట్టుకోవడం ఇలాంటివి అన్నీ తెలిసివచ్చాయి.

జగన్ కు పడని వారు అంటే తనకు మరింత ఆప్తులు అనే కోణంలో పవన్ వెళ్లి కొణతాలను తన దగ్గరకు తీసుకున్నారు అనుకోవాలి. లేదా త్రివిక్రమ్ రికమెండేషన్ కూడా ఫలించి వుండాలి. మొత్తం మీద అయిదేళ్ల గ్యాప్ తరువాత కొణతాల లైమ్ లైట్ లోకి వచ్చారు.