విశాఖ ఇక మీదట సిటీ ఆఫ్ ఆంధ్ర!

ఏపీ రాజధాని ఏది అన్నది పక్కన పెడితే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అన్నది కొలమానంగా తీసుకోవాలి. అలా అనుకుంటే విశాఖ మరో నలభై అయిదు రోజులలో రాజధాని నగరం అవుతుందని వైసీపీ నేతలు దృఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో రెండు రోజుల పాటు గడిపారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో మాట్లాడిన సందర్భంలో కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో నిర్వహించిన సమావేశంలో కానీ విశాఖ గురించే చెబుతూ వస్తున్నారు. విశాఖ నుంచి పాలన సాగుతుందని జగన్ భరోసా ఇస్తున్నారు. విశాఖ ఈ రోజున సిటీ ఆఫ్ డెస్టినీ. రేపటి రోజున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అని జగన్ స్పష్టం చేశారు.

విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తే ఈ నగరం కూడా హైదరాబాద్, చెన్నయి, బెంగళూరులతో పోటీ పడే పరిస్థితికి చేరుకుంటుందని జగన్ విశాఖ ఉజ్వల భవిష్యత్తు మీద తనదైన విశ్లేషణ చేశారు. విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాదు ఐటీ రంగం కూడా అభివృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

వైసీపీ నేతలు కూడా జగన్ రెండవసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెబుతున్నారు. విశాఖలోనే జగన్ సీఎం గా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు అని అంటున్నారు. విశాఖ నుంచి సీఎం క్యాంప్ ఆఫీసు ద్వారా పాలన మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఉన్న నేపధ్యంలో విశాఖ ఇక మీదట సిటీ ఆఫ్ ఆంధ్ర అనే చదువుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.