పుష్ప Vs ఆవేశం.. తేడా చెప్పలేకపోయిన నటుడు

పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహాద్ ఫాజిల్ నటనను ఎవ్వరూ మరిచిపోలేరు. పుష్ప-2తో తన విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు ఈ నటుడు. అయితే ఈ గ్యాప్ లో మరో సినిమాను కూడా విడుదల చేశాడు. ఆ సినిమా పేరు ఆవేశం.

మలయాళంలో సూపర్ హిట్టయింది ఆవేశం మూవీ. ఈ సందర్భంగా తను నటిస్తున్న పుష్ప-2, ఆవేశం సినిమాల మధ్య తేడా చెప్పుకొచ్చాడు ఫాజిల్.

పుష్ప, పుష్ప-2 కథలకు యూనివర్సస్ అప్పీల్ ఉందంట. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఆ కథను ఏ అటవీ నేపథ్యంలోనైనా చెప్పొచ్చని అన్నాడు. అదే ఆవేశం సినిమా విషయానికొస్తే, అంత వెసులుబాటు లేదని అంటున్నాడు.

కథ ప్రకారం బెంగళూరు నేపథ్యంలో మాత్రమే ఆవేశం సినిమాను చెప్పాలని, దాని కోసం స్థానిక భౌగోళిక పరిస్థితులు, ఆచార-సంప్రదాయాలు బాగా తెలియాలని అన్నాడు. బెంగళూరు బ్యాక్ డ్రాప్ లేకుండా ఆవేశం కథను రాయలేమని, పుష్ప కథను ఏ అటవీ నేపథ్యంలోనైనా రాసుకోవచ్చని అన్నాడు.

సరిగ్గా ఇక్కడే నెటిజన్లు, ఫహాద్ ఫాజిల్ చేసిన తప్పును పట్టుకున్నారు. నిజానికి పుష్ప కథ కూడా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ కాదు. పూర్తిగా తిరుపతి నేపథ్యం కలిగిన సినిమా ఇది. ఈ సినిమా మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంది. బహుశా, ఎర్ర చందనం ప్రతి అడవిలో దొరకదనే విషయం ఫాజిల్ కు తెలియదేమో.