జ‌న‌సేన‌కు బిగ్ షాక్‌!

జ‌న‌సేన‌తో పాటు టీడీపీ, బీజేపీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఫ్రీ సింబ‌ల్‌గా ఉంచిన గాజుగ్లాసు గుర్తును... జ‌న‌సేన బ‌రిలో లేని చోట స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు ఎన్నిక‌ల అధికారులు కేటాయించ‌డం కూట‌మిలో క‌ల‌క‌లం రేపుతోంది. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు ఇవాళ్టితో ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్య‌ర్థులెవ‌రో తేలిపోయింది.

ఈ నేప‌థ్యంలో గుర్తింపు పొందిన పార్టీల గుర్తుల గురించి బాధ లేదు. రిజిస్ట‌ర్డ్‌, ఇండిపెండెంట్ అభ్య‌ర్థులంద‌రూ ఫ్రీసింబ‌ల్‌గా ఉంచిన జ‌న‌సేన గుర్తు గాజుగ్లాసుపై కన్నేశారు. విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ రెబ‌ల్ అభ్య‌ర్థి మీసాల గీత‌, జ‌గ్గంపేటలో జ‌న‌సేన రెబ‌ల్ అభ్య‌ర్థి పాఠంశెట్టి సూర్య‌చంద్ర‌, మ‌ద‌న‌ప‌ల్లెలో కూడా ఇండిపెండెంట్ అభ్య‌ర్థికి గాజుగ్లాసు గుర్తు కేటాయించార‌నే వార్త‌లొస్తున్నాయి.

ఈ ప‌రిణామాల‌పై కూట‌మి నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మూడు పార్టీలు క‌లిసి కూట‌మిగా ముందుకెళుతున్నాయ‌ని, ఫ్రీ సింబ‌ల్‌గా ఉంచిన గాజుగ్లాసు గుర్తును జ‌న‌సేన‌కు మిన‌హాయించి మ‌రే ఇత‌ర పార్టీలు, ఇండిపెండెంట్‌ల‌కు కేటాయించొద్ద‌ని ప‌లుమార్లు రాష్ట్ర‌, కేంద్ర ఎన్నిక‌ల అధికారుల‌కు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు విన్న‌వించుకున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌కే గాజుగ్లాసు గుర్తు సొంతం చేస్తూ కేంద్ర ఎన్నిక‌ల అధికారులు ఆదేశాలు ఇచ్చిన‌ట్టు వార్త‌లొచ్చాయి.

కానీ జ‌న‌సేన‌కు ఒక్క‌సారిగా ఎన్నిక‌ల అధికారులు షాక్ ఇస్తూ... గాజుగ్లాసు గుర్తును ఇత‌రుల‌కు కేటాయించ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఎన్నిక‌ల అధికారులకు ఎంత‌గా చెప్పినా, వారు ఏ మాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏంట‌ని కూట‌మి నేత‌లు నిల‌దీస్తున్నారు.