వారు పార్టీలో ఉంటే మాత్రం రోజాను గెలవనిస్తారా?

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారిలో శ్రీశైలం దేవస్థానం ట్రస్టుబోర్డు ఛైర్మన్ గా గతంలో పనిచేసిన రెడ్డివారి చక్రపాణి రెడ్డి సహా కీలక నేతలు ఉన్నారు. అలాగని వారు మరో పార్టీలో ఏమీ చేరలేదు. వారికి ఉన్న సింగిల్ పాయింట్ ఎజెండా.. రోజా పట్ల వ్యతిరేకత మాత్రమే. వారంతా ఇప్పుడు రోజాకు వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారంలో ఉన్నారు. అయితే వీరందరూ కలిసి రోజా ఓటమిని శాసించగలరా? వీరికి అంత సీనుందా అనేది ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా ఉంది.

శ్రీశైలం ఆలయ ఛైర్మన్ గా పనిచేసిన చక్రపాణి రెడ్డి ఇప్పుడే కాదు, గత ఎన్నికలకు ముందు నుంచి కూడా రోజా ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఆమెను ఓడించడానికే ప్రయత్నించారు. ఆయనకు జిల్లాకు చెందిన కీలక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో చక్రపాణిరెడ్డి తదితరుల వ్యతిరేకతను తట్టుకుని కూడా రోజా గెలిచారు. ఆయన చేసిన పార్టీ ద్రోహాన్ని పట్టించుకోకుండా జగన్ ఆయనకు పెద్దిరెడ్డి ఒత్తిడి మేరకు శ్రీశైలం ఆలయ ట్రస్టుబోర్డు పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత అయినా సరే చక్రపాణి వైఖరిలో మార్పు వచ్చి ఉండాల్సింది.. అలా జరగలేదు. పదవిదక్కినా సరే.. ఆయనలో రోజా వ్యతిరేకత సమసిపోలేదు.

ఈ ఎన్నికలకు ముందు తన వర్గం వారందరినీ వెంటబెట్టుకుని వెళ్లి జగన్ ను కలిసి రోజాకు టికెట్ ఇవ్వవద్దని ఇస్తే ఓడిస్తామని అన్నారు. అయినా జగన్ పట్టించుకోకుండా రోజాకే టికెట్ ఇవ్వడం జరిగింది.

మరొకవైపు చక్రపాణి రెడ్డి ఆయన వర్గం నుంచి తనకు ద్రోహం జరుగుతుందనే ఆలోచన ముందునుంచి ఉన్న రోజా తన జాగ్రత్తలో తాను ఉన్నారు. నియోజకవర్గంలోని అనేక మంది పార్టీ నాయకులను చాలా కాలం ముందు నుంచి తన వర్గంగా మార్చుకుంటూ జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఆ రకంగా గత ఎన్నికల కంటె ఆమె బలంగానే ఉన్నారు.

కాగా ఇప్పుడు చక్రపాణిరెడ్డి, భాస్కర్రెడ్డి, మురళీధర్ రెడ్డి, సర్పంచులు తదితరులు పార్టీకి రాజీనామా చేశారు. ఆల్రెడీ కొన్ని రాజీనామాలు జరిగాయి. రోజాను ఓడించాలని, ఆ తర్వాత జగన్ సర్కారు ఏర్పడితే.. మళ్లీ పెద్దిరెడ్డి ప్రాపకంతో పార్టీలోకి వచ్చి నియోజకవర్గంలో చక్రం తిప్పాలనేది వీరి ఆలోచన కావొచ్చు.

కానీ, చావో రేవో అన్నట్టుగా సాగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పనిచేసిన వారిని జగన్ తర్వాత క్షమిస్తారా అనేది సందేహం. అలాగే.. అసలు రోజాను ఓడించేంత సీన్ ఈ నాయకులకు ఉన్నదా అని కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు.