ఫైట్ మాస్టర్ కొడుకు ఆ మతాన్ని కించపరిచాడట

ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతినడం సినిమా వాళ్లకు అష్టకష్టాలు కొనితెచ్చిపెడుతున్నాయి. ఎంత జాగ్రత్తగా సినిమాలు తీసినా, పాటలు రాసినా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వర్గానికి అది నొప్పి కలిగిస్తూనే ఉంది. దీంతో మనోభావాలు దెబ్బతిని, భావావేశాలు పొంగిపోయి చివరకు థియేటర్ల ముందు గొడవకు కారణమవుతున్నాయి. 

తాజాగా 'ఈమాయ పేరేమిటో' అంటూ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన కొత్త సినిమాలో జైన మతాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయంటూ పలు ప్రాంతాల్లో జైనులు థియేటర్ల వద్ద హంగామా సృష్టించారు. సినిమా బ్యాన్ చేసేవరకు తమ పోరాటం ఆపబోమని, పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నామని, హైకోర్టుకు వెళ్తున్నామని వారు హెచ్చరిస్తున్నారు.  

తమ మతానికి చెందిన మంత్రాన్ని సినిమా టైటిల్ సాంగ్ లో వాడారనేది జైనుల ప్రధాన ఆరోపణ. అయితే ఆ మంత్రం వచ్చేటపుడు చూపించే సన్నివేశాలు అసభ్యంగా ఉన్నాయని, దీనితో పాటు సినిమాలో కూడా పలుచోట్ల మంత్రాన్ని అభ్యంతరకరంగా వాడారని ఆరోపిస్తున్నారు. 

సినిమాలో హీరోయిన్ జైనుల ఇంటి అమ్మాయి. పేరు కూడా శీతల్ జైన్ అని పెట్టారు. హీరో పేరు శ్రీరామ చంద్రమూర్తి. వీళ్లిద్దరి లవ్ స్టోరీయే ఈ సినిమా. ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.