కోమటిరెడ్డి కొంచెమైనా తగ్గట్లేదంతే!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలోని కొందరునేతలను బ్రోకర్లు అని, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి కుంతియాను శని అని వ్యాఖ్యానించినందుకు పార్టీ క్రమశిక్షణ కమిటీ నుంచి నోటీసులు ఎదుర్కొన్నారు. నోటీసులు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికీ.. తనకు నోటీసులు ఇచ్చిన వారిమీద కూడా ఆయన విరుచుకుపడుతుండడం విశేషం. కాంగ్రెస్ పార్టీలో అసలే ముఠా కక్షలు ఎక్కువ. గ్రూపిజం ఎక్కువ. వీరందరినీ సంతృప్తి పరచడమే తమ లక్ష్యం అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంసిద్ధం కావడానికి మొత్తం పది కమిటీలను నియమించింది.

నిజానికి ఈ కమిటీలకు ఏం అధికారాలు ఉంటాయో, ఎంతమేరకు కోరలు ఉంటాయో కూడా తెలియని సంగతి. కాంగ్రెస్ ముద్ర ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకపదవి అనే దామాషాలో ఈ కమిటీలను వేసినట్లుగా  కనిపించింది. ఇంతచేసినా కూడా, కమిటీలు అనేవి పార్టీకి ఎంతలాభం చేశాయో తెలియదు గానీ.. అంతకు మించి నష్టంచేసేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తనకు ఇచ్చిన వ్యూహ కమిటీ వద్దని వీహెచ్ అలిగి వెళ్లిపోగా, తనకు కమిటీల్లో చోటులేనందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ కత్తులు నూరుతున్నారు.

ఆయన రెండురోజుల కిందట మాట్లాడుతూ.. బ్రోకర్లకు కమిటీలో చోటిచ్చారంటూ మండిపడ్డారు. దానిపై షోకాజులు రాగా.. టికెట్లు అమ్ముకునే వారికి షోకాజులు ఇచ్చే అర్హత ఉందా అంటూ మళ్లీ విరుచుకుపడుతున్నారు. కాకపోతే కాస్త మెత్తబడి, కాంగ్రెస్ అధిష్టానం మీద నమ్మకం ఉందని, సోనియా, రాహుల్ మీద నమ్మకం ఉందని ఆయన అంటున్నారు. అధిష్టానాన్ని ప్లీజ్ చేసుకుంటే ఇలాంటి షోకాజుల వల్ల ఇబ్బందేమీ ఉండదు లెమ్మని ఆయన ఫిక్సయినట్లుగా ఉంటోంది.

కోమటిరెడ్డి సోదరులకు తొలినుంచి పీసీసీ నాయకత్వంతో పొసగడంలేదు. ఈ విషయం పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ అనేకమార్లు బయటపడింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ స్థానాన్ని కోరుకున్నారు గానీ.. ఆయన వినతిని పార్టీ పట్టించుకోలేదు. మధ్యలో నల్గొండ జిల్లాలో ఒక్క సీటు కూడా తెరాసకు కోల్పోకుండా కాంగ్రెస్ ను గెలిపిస్తాం అంటూ వారు పట్టుపట్టి సవాళ్లు చేస్తున్నారు. ఆ రేంజిలో తెరాసను ఢీకొంటున్నారు. ఇంత జరుగుతున్నా.. వారికి పార్టీలో సరైన ప్రాధాన్యం మాత్రం దొరక్కపోవడం విశేషం.