స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అరెస్ట్ ఆ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. అయితే బాబు ఒక్కడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడంతో అరెస్ట్‌ల పర్వం ముగిసిందని ఎవరైనా అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి వుండదు. బాబును అరెస్ట్ చేసి జైలు ఊచలు లెక్క పెట్టేలా చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాంతిస్తారని అనుకుంటే పొరపాటే.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాల్ని పసిగట్టడం అంత సులువు కాదు. బాబు అరెస్ట్ నేపథ్యంలో న్యాయస్థానానికి ఏపీ సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో నారా లోకేశ్ పేరు కూడా ప్రముఖంగా వుంది. దీంతో ఆయన అరెస్ట్ కూడా తప్పదని టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. లోకేశ్ అరెస్ట్ ఎప్పుడనేదే ఇప్పుడు ప్రశ్న. లోకేశ్ అరెస్ట్ మాత్రం పక్కా అని టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా నమ్ముతోంది.
అయితే అసలు విషయం వేరే ఉందని తెలిసింది. వీళ్లద్దరి అరెస్ట్‌తోనే వైసీపీ ప్రభుత్వం సంతృప్తి చెందదని అధికార పార్టీ వర్గాల ద్వారా సమాచారం. టీడీపీతో పాటు ఏ రాజకీయ పార్టీ ఊహించని విధంగా రానున్న రోజుల్లో షాకింగ్ కేసులు లేదా అరెస్ట్‌లు వుంటాయని అత్యంత విశ్వసనీయ సమాచారం. రానున్న రోజుల్లో నమోదయ్యే కేసులు లేదా అరెస్ట్‌లు టీడీపీని పూర్తిగా కకావికలం చేస్తాయని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇప్పట్లో చంద్రబాబుకు బెయిల్ రాదని, అలాగే ఒక్కొక్కరిగా ఆయన చెంతకే సీఎం జగన్ పంపే వరకూ నిద్రపోరని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన సమయంలో, టీడీపీని పూర్తిగా పక్కదారి పట్టించేందుకు వైసీపీ వ్యూహం రచిస్తోంది. అధికరాంలోకి రావడం పక్కన పెట్టి, కేసుల నుంచి బయట పడడం ఎలా అనే వ్యూహ రచనలో టీడీపీ తలమునకలయ్యేలా వైసీపీ పథక రచన చేస్తోంది. ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.