ఇదిగో, అదిగో చంద్రబాబు జైలు నుంచి బయటికి వస్తున్నారని ఎల్లో మీడియా ఊదర గొట్టింది. ఎల్లో మీడియాకు పచ్చ గళాలు శ్రుతి కలిపాయి. దీంతో బాబు కేసులకు సంబంధించి ఎల్లో బ్యాచ్‌కు ప్రత్యేకంగా ఏదైనా సమాచారం వుందేమో అని అంతా భావించారు. బాబుకు బెయిల్, అలాగే క్వాష్ పిటిషన్‌పై తమకు అనుకూలమైన తీర్పుల్ని ఎల్లో చానల్స్ ఇవ్వడం విమర్శలకు దారి తీసింది.
బాబు కేసులపై ఎల్లో మీడియా అత్యుత్సాహం ఎలా ఉన్నా, వాస్తవం మాత్రం టీడీపీకి చేదుగా వుందని చెప్పక తప్పదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు దసరా జరుపుకోవాల్సి వచ్చింది. న్యాయ స్థానాల్లో చంద్రబాబుకు మరోసారి ఏ మాత్రం ఊరట దక్కలేదు. పైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఉపశమనం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్‌పై సానుకూల తీర్పు వస్తుందని టీడీపీ ఆశించింది. అయితే ఈ కేసు విచారణను నవంబర్ 9కి వాయిదా వేయడంతో చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్టైంది. మరోవైపు బాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇదే ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.
లిఖిత పూర్వక వాదనలకు శుక్రవారం చివరిగా గడువు ఇచ్చింది. క్వాష్ పిటిషన్‌పై నవంబర్ 8న తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో మరో 20 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు ఉండడం ఖాయమైంది. అంటే చంద్రబాబు తప్పనిసరిగా రెండు నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడపడం నిశ్చయమైంది. దసరా పండుగను జైల్లోనే చంద్రబాబు చేసుకోవాల్సిన పరిస్థితి.
క్వాష్, ఫైబర్‌నెట్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులపై మళ్లీ అదే ఉత్కంఠ తప్పడం లేదు. ఆ రెండు రోజుల్లో ఎలాంటి తీర్పులొస్తాయో అనే చర్చకు తెరలేచింది.