ఏపీ బీజేపీ పురందేశ్వరి అత్యుత్సాహం ఆమె మరిది చంద్రబాబు మెడకు చుట్టుకునేలా వుంది. గత కొంత కాలంగా మద్యం కేంద్రంగా వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి విమర్శనా బాణాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. మద్యం విక్రయాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని, సీబీఐతో విచారణ జరిపించాలని గత నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కూడా పురందేశ్వరి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో పురందేశ్వరి మరింత రెచ్చిపోయారు. ఒక్కసారిగా పిడుగుపాటు నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకోవడంతో పురందేశ్వరి షాక్‌కు గురయ్యారు.
చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలకు చెందిన కంపెనీలకు అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేశారనేది వైసీపీ ప్రభుత్వ అబియోగం. దీని వల్ల ఖజానాకు ప్రతి ఏడాది రూ.1300 కోట్ల నష్టం సంభవించిందని, ఈ కుంభకోణంపై ఏపీ బేవరేజస్ కంపెనీ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబు ఏ3 నిందితుడు.
తన మరిది చంద్రబాబు పరిపాలనలో 2014-19 మధ్య కాలంలో అవకతవకలపై కూడా సీబీఐ, ఈడీతో విచారణ జరిపాలని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయగలరా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. నిజంగా పురందేశ్వరికి చిత్తశుద్ధి, రాష్ట్ర ఆదాయాన్ని కాపాడాలనే నిజాయతీ వుంటే... బాబు హయాంనాటి స్కామ్‌పై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల జోక్యాన్ని కోరాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబును స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ చేశారని జీర్ణించుకోలేకనే పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై రగిలిపోతున్నారని బలమైన ఆరోపణ వుంది.
చంద్రబాబు హయాంలో మద్యం అనుమతులపై సీఐడీ నమోదు చేసిన కేసు ఇప్పుడు పురందేశ్వరికి సవాల్‌గా మారింది. అసలు పురందేశ్వరి అతి వల్లే వైసీపీ ప్రభుత్వం మద్యం అనుమతులపై లోతుగా అధ్యయనం చేసి, చంద్రబాబును ఇరికించిందని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసినట్టుగా, ఇప్పుడు చంద్రబాబుపై పురందేశ్వరి నోరు తెరవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో అవినీతిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కోసం పురందేశ్వరి డిమాండ్ చేస్తేనే, ఆమె టీడీపీ కోసం కాకుండా బీజేపీ రాజకీయ ప్రయోజనాల నిమిత్తం పని చేస్తున్నారని నమ్ముతారంటున్నారు.