తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇందుకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికైంది. సీఎంగా రేవంత్‌రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. ఇద్దరు మంత్రులు మినహా సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు దైవం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క మాత్రం పవిత్ర హృదయం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. హృదయానికి మించిన ఆత్మసాక్షి మరొకటి వుండదు. బహుశా ఆ ఉద్దేశంతోనే సీతక్క, పొంగులేటి హృదయం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు.
ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియం కాంగ్రెస్ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. సీఎంగా రేవంత్‌రెడ్డితో పాటు ఇతర నాయకులు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వారి అభిమానులు బిగ్గరగా కేకలు వేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లకు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అమితమైన సంతోషం కనిపించింది. కాంగ్రెస్ అగ్రశ్రేణులంతా హాజరైన వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మొత్తానికి ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. ఇక పాలన మొదలైంది.