మంగళగిరి నుంచి రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయనను పక్కన పెట్టి.. గంజి చిరంజీవిని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చేసిన నిర్ణయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే పదవికే కాదు, తన పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాలు ఇంకా ఆమోదం పొందినట్టు లేదు. పార్టీ ఆయనను దూరం చేసుకునే ఉద్దేశంతో లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి అసంతృప్తితో ఉండడం సహజమే గానీ, ఆ వేడిలో కనీస మర్యాదలను కూడా మరచిపోతున్నారని అనిపిస్తోంది.
పార్టీ అధిష్ఠానం తరఫున పెద్దలు ఆయనను సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రావడం లేదని ఒక పుకారు వినిపిస్తోంది. ఆయన తన నివాసంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతూ.. తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. నా రాజీనామా కారణాలు వెల్లడిస్తా.. వాటిని జనంలోకి తీసుకువెళ్లండి ఆయన పార్టీ వారిని కోరుతున్నట్టుగా సమాచారం.
గత మూడు నెలలుగా నియోజకవర్గంలో ఒక్క పనీ చేయలేకపోయాననే బాధతో రాజీనామా చేశా అని ఆయన చెప్పుకుంటున్నారట. తాను పనిచేయలేకపోయాను అనడం అంటే.. పరోక్షంగా తన నియోజకవర్గంలో పనులు జరగడం లేదంటూ పార్టీని , ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే మాటలే.
ఇక్కడ ఆర్కే ఒక లాజిక్ మిస్సవుతున్నారు. మళ్లీ ఏదో ఒక పార్టీ నుంచి పోటీచేస్తా.. గెలుస్తా.. ప్రజాజీవితంలోనే ఉంటా అని ప్రకటించే నాయకుడైతే.. ఆయన వెంట ఎవరో కొందరు నాయకులు మిగులుతారు. ఆయన వెంట వైసీపీ ని వీడి రావడానికి కూడా సిద్ధంగా ఉంటారేమో. కానీ.. ఆర్కేకు తెలుగుదేశం, జనసేనల్లోకి ఎంట్రీ కూడా ఉండదనే సంగతి అందరికీ తెలుసు.
వైసీపీకి రాజీనామా చేస్తే రాజకీయం మానుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఆ స్పృహ ఉన్నది గనుకనే.. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని చెబుతున్నారు. నిజానికి ఇదే మాట గత ఎన్నికల ప్రచార సమయంలోనే చెప్పారు. అవే చివరి ఎన్నికలని.. 2024 ఎన్నికల్లో తాను తప్పుకుని నియోజకవర్గంలో బీసీలకు అవకాశం ఇస్తానని అన్నారు. ఇప్పుడు మర్చిపోయారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. పార్టీ కొత్త ఇన్చార్జి గంజి చిరంజీవి పట్ల ఆయన ప్రవర్తించిన తీరు మర్యాద లేకుండా ఉంది. ఆయనను కలవడానికి గంజి చిరంజీవి ఇంటికి వస్తే.. కార్యకర్తలు లోనికి పంపలేదు. ఆయన మేడమీదకు వెళ్లిపోయారని, భోంచేస్తున్నారని చెబుతూ.. కలవనివ్వలేదు. దాంతో చాలా సేపు నిరీక్షించిన గంజి చిరంజీవి , ఆర్కేను కలవకుండానే తిరిగి వెళ్లిపోయారు.
పార్టీ మీద అసంతృప్తి ఉంది సరే.. అందుకని కనీస మర్యాద లేకుండా వ్యవహరిస్తే ఎలా అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. టికెట్ ఇవ్వలేదు గనుక.. పార్టీని ఓడించడానికి పూనుకుంటారా? అని కూడా అనుకుంటున్నారు.