దారుణం.. స్నేహితుడే కిరాతకుడు

అవసరానికి ఆదుకునేవాడ్ని స్నేహితుడంటారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం ఆ అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఆస్తి కాజేశాడు. అంతేకాదు, తన స్నేహితుడి పాలిట కిరాతకుడిగా మారాడు. ఆస్తి కోసం ఏకంగా ఫ్రెండ్ కుటుంబంలోని ఆరుగుర్ని హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

మాక్లూర్ కు చెందిన ప్రసాద్, ప్రశాంత్ స్నేహితులు. కుటుంబం కోసం ప్రసాద్ చాలా అప్పులు చేశాడు. వాటిని తీర్చడం కోసం ఇల్లుపై రుణం తీసుకోవాలనుకున్నాడు. దీని కోసం ప్రశాంత్ సహాయం కోరాడు. బ్యాంకులు చెప్పే కండిషన్స్ ప్రకారం లోన్ కావాలంటే, తన పేరు మీద ఇల్లు ఉంటే తొందరగా లోన్ వస్తుందని నమ్మించాడు ప్రశాంత్.

స్నేహితుడి మాటలు నమ్మిన ప్రసాద్, ప్రశాంత్ పేరిట ఇల్లు రిజిస్టర్ చేశాడు. అయితే బ్యాంకుల నుంచి రుణం రాలేదు. దీంతో తిరిగి ఇంటిని తన పేరుమీద రిజిస్టర్ చేయాలని ప్రశాంత్ పై ఒత్తిడి తెచ్చాడు. సరిగ్గా ఇక్కడే ప్రశాంత్ లో మృగం మేల్కొంది. ప్రసాద్ కుటుంబాన్ని అంతం చేస్తే ఇల్లు తన వశమౌతుందని కుట్ర పన్నాడు.

అనుకున్నదే తడవుగా ప్రసాద్ ను డిచ్ పల్లి జాతీయ రహదారిపైకి తీసుకెళ్లాడు. అక్కడే అతడ్ని హత్య చేసి పూడ్చి పెట్టాడు. అప్పుల వాళ్లు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నమ్మించి, అతడి భార్యను బాసర తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేసి, గోదాట్లో పడేశాడు. Readmore!

ఆ తర్వాత మాయమాటలు చెప్పి ప్రసాద్ చెల్లెల్ని, ప్రసాద్ ఇద్దరు పిల్లల్ని కూడా హత్య చేశాడు ప్రశాంత్. అలా వారం రోజుల వ్యవథిలో ప్రసాద్ కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు. కాల్వలో పిల్లల మృతదేహాలు లభ్యం కావడంతో, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాస్త లోతుగా వెళ్లి విచారణ చేస్తే ప్రశాంత్ పై అనుమానం కలిగింది.

ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, తమదైన శైలిలో ఎంక్వయిరీ చేయగా, మొత్తం 6 మర్డర్ల మేటర్ బయటకొచ్చింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ప్రశాంత్ తో పాటు అతడికి సహకరించిన ఇద్దరు స్నేహితుల్ని, ప్రశాంత్ సోదరుడ్ని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడని నమ్మినందుకు ప్రసాద్ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. 

Show comments

Related Stories :