టీడీపీ నమ్మించి నట్టేట ముంచుతుందని జనసేన శ్రేణులు ముందు నుంచి అనుకున్నట్టుగానే జరిగింది. టీడీపీతో పొత్తులో భాగంగా అధికారంలో చంద్రబాబు షేర్ ఇస్తారని జనసేన నాయకులు, కార్యకర్తలు ఆశించారు. అధికారంలో భాగమంటే పవన్‌కల్యాణ్‌కు ఎంతోకొంత కాలం ముఖ్యమంత్రిగా చూసే భాగ్యాన్ని చంద్రబాబు కల్పిస్తారని జనసేన శ్రేణులు ఎన్నెన్నో ఆశించాయి. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే... ఈ కలలన్నీ నెరవేరుతాయని పవన్ అభిమానులు గంపెడాశతో ఉన్నారు.
అయితే జనసేన శ్రేణుల ఆశ, నమ్మకంపై టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ నీళ్లు చల్లారు. ఒక్క మాటలో చెప్పాలంటే జనసేనను లోకేశ్ చావు దెబ్బ తీశారు. సీఎం పదవి గురించి చంద్రబాబు, తాను కూర్చొని మాట్లాడుకుంటామని ఇటీవల పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పవన్‌కు అంత సీన్ లేదని, ముఖ్యమంత్రిగా చంద్రబాబే వుంటారని లోకేశ్ తేల్చి చెప్పారు.
ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనతో ఓట్లు, సీట్లు పంచుకుంటున్నారని, అదే రీతిలో సీఎం పదవిని కూడా పంచుకుంటారా? అని జర్నలిస్టు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఏ మాత్రం తడుము కోకుండా చాలా కాన్ఫిడెంట్‌గా లోకేశ్ ఇచ్చిన సమాధానం ఏంటంటే...
"చాలా స్పష్టంగా చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి. దాని గురించి రెండో ఆలోచనే లేదు. పవన్‌కల్యాణ్ కూడా చాలా సార్లు చెప్పారు ... సమర్థవంతమైన నాయకత్వం కావాలని. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుభవం ఉన్న నాయకత్వం చాలా అవసరమని ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అందరి మాట అదే" అని లోకేశ్ తేల్చి చెప్పారు.
లోకేశ్ కామెంట్స్‌పై జనసేన శ్రేణులు రగిలిపోతున్నాయి. సీఎం పదవికి పవన్‌ను కనీసం పరిగణలోకి తీసుకోకుండా ఎలా మాట్లాడ్తారని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. చూడాలి ఏమవుతుందో!