ఎన్నికల్లో రంగంలోకి దిగే అభ్యర్థుల విషయంలో మార్పుచేర్పులంటే అవి తీరా నోటిఫికేషన్ వచ్చాకా చేసేవని కాకుండా, ముందస్తుగానే వాటిని చేపట్టి సాహసోపేతమైన అడుగును వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి తేల్చేశారు. మార్పుచేర్పులు చేయాలనుకుంటున్న నియోజకవర్గాల విషయంలో ప్రక్రియను వేగవంతం చేసినట్టుగా కనిపిస్తున్నారు జగన్! మరి మార్పుచేర్పుల గురించి పార్టీ కార్యవర్గానికి, ప్రజలకూ వీలైనంత ముందుగా క్లారిటీ ఇవ్వడం రాజకీయంగా సరైన అడుగే! అలాగే నేతలకు కూడా ఈ స్పష్టతను ముందుగానే ఇవ్వడం ద్వారా జగన్ పరిస్థితులను ఎదుర్కొనడానికి తగురీతిన సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను కూడా పంపుతున్నారు!
విశేషం ఏమిటంటే.. జగన్ చేస్తున్న మార్పు చేర్పుల పట్ల పార్టీ క్యాడర్ నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవడం! మరి కొన్ని చోట్ల అయితే మార్పు చేయాలనే ఒత్తిడి పార్టీ క్యాడర్ నుంచినే వస్తూ ఉండటం! అందుకు అనుగుణంగా జగన్ నిర్ణయం తీసుకుంటూ ఉండటం. ఇదీ ఈ ఎపిసోడ్లో హైలెట్ పాయింట్. తమ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడం లేదు అనే ప్రకటన పార్టీ అధిష్టానం చేస్తే క్యాడర్ రోడ్డెక్కే దృశ్యాలు కూడా గతంలో ఉన్నాయి. పార్టీ అధిష్టానం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని నిరసన తెలిపిన సందర్భాలు కూడా ఉంటాయి.
అయితే ఇప్పటి వరకూ జగన్ చేసిన మార్పుచేర్పుల విషయంలో అయినా, ఇకపై చేయబోతున్నారనే ఊహాగానాల విషయంలో అయినా పార్టీ క్యాడర్ నుంచి అయితే ఎక్కడా చిన్నపాటి నిరసన కూడా లేదు! మార్పులను పార్టీ క్యాడర్ స్వాగతిస్తోందనే విషయం స్పష్టం అవుతోంది. జగన్ చేయబోయే మార్పుచేర్పుల్లో 82 నియోజకవర్గాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. ఇప్పటికే దాదాపు 20 చోట్ల విషయంలో తేల్చేశారు. ఓవరాల్ గా ఎన్ని మారుస్తారో కానీ, ఈ విషయంలో పార్టీ క్యాడర్ నుంచి జగన్ కు సహాయ నిరాకరణ ఏమీ ఉండదని స్పష్టం అవుతోంది!
అయితే అవకాశం కోల్పోయే నేతలు పార్టీకి ఎంత వరకూ సహకరిస్తారు? అనేదే అసలైన ప్రశ్న! అసెంబ్లీ కోటాలో మండలి ఎన్నికలప్పటి వ్యవహారంలో పార్టీకి దూరం అయిన వారిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లిపోయారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరు వచ్చినా వారిని కళ్లకు అద్దుకుని తీసుకుంటారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇలాంటివి ఆయనకు బాగా ఇష్టం. మరి ఇన్నాళ్లూ వైసీపీ ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన వారిని ఇప్పుడు చంద్రబాబు ఎలా చేర్చుకుని టికెట్లు ఇవ్వడమో, నేతలుగా గుర్తించడమో చేస్తారు? అంటే.. అదంతే! ఇలాంటి వ్యవహారాలు తెలుగుదేశం పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తాయి. అయితే నేతలు చేరితే పార్టీ బలోపేతం అయిపోతుందనే లెక్కలేస్తూ చంద్రబాబు నాయుడు గతంలోనూ ఇలాంటి చేరికలు తెగ ప్రాధాన్యతను ఇచ్చారు, అప్పుడు బాగా నష్టపోయారు కూడా! అయినప్పటికీ చంద్రబాబు ఆలోచనా తీరు మారకపోవచ్చు.
ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమకు అవకాశం దక్కదనే క్లారిటీతో ఆ పార్టీని వీడిన వారిని చంద్రబాబు చేర్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో జగన్ టికెట్ ఇవ్వని వారందరినీ చేర్చుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు వెనుకాడరు! ఇలా జగన్ కు చంద్రబాబు నాయుడు చాలా తలనొప్పి తగ్గిస్తున్నారు కూడా! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కకపోవడం వల్ల ఇండిపెండెంట్ గా బరిలోకి దిగే వారు రెబల్స్ గా పార్టీకి నష్టం చేస్తారేమో అనే చింత లేకుండా చంద్రబాబు నాయుడే వారిని దగ్గరుండి చేర్చుకుంటున్నారు! జగన్ నో చెప్పిన వారు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి రెబల్స్ గా మారితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయొచ్చు. అయితే వారు తెలుగుదేశం పార్టీ లోకి వెళ్లడం వల్ల పిక్చర్ ఫుల్ క్లారిటీ వచ్చినట్టే!
ఇలాంటి వారు తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టించగలరు. పార్టీ క్యాడర్ లో విసుగును తెప్పించగలరు! ఇన్నాళ్లూ అధికారంలో ఉంటూ తమను వేధించిన వారు ఇప్పుడు తమ పార్టీ వాళ్లు అయిపోయి తమపై తిరిగి అజమాయిషీ చేస్తే పార్టీ క్యాడర్ కు ఎక్కడ మండుతుందో వేరే చెప్పనక్కర్లేదు! ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరారని ప్రచారం చేసుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో డక్కామొక్కీలు తినే క్యాడర్ కు మాత్రం ఇది సయించే అంశం కాదు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేగా, అధికార పార్టీ నేతగా తమను చిత్రహింసలు పెట్టారని, ఇప్పుడు తాము ఆయనను మోయాలా అంటూ ఆ నియోజకవర్గం పరిధిలోని క్యాడర్ ఏ స్థాయిలో నిరాశపడుతుందో వేరే చెప్పనక్కర్లేదు. పదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా తాము వ్యతిరేకతను పెంచుకున్న వ్యక్తిని ఇప్పుడు ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తలు మోస్తారనేది ప్రశ్నార్థకం! కేవలం ఒక కోటంరెడ్డి కాదు, ఇలాంటి వారు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద మరింత పడబోతున్నారనేది సుస్పష్టమైన అంశం!