తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసినందుకు రాష్ట్రవ్యాప్తంగా భారాస దళాలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలోనే తిష్టవేసి.. కవిత అరెస్టు వ్యతిరేక ఉద్యమాలను ఎలా ఉధృతం చేయాలో వ్యూహరచన చేసే పనిలో ఉన్నారు. ఈలోగా ఈకేసులో మరొక కీలక నిందితుడు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కూడా అరెస్టు అయ్యారు.
ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి సెర్చ్ వారెంట్ తో వెళ్లి, విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేశారు. ఆప్ అనుకూల నినాదాలతో ఢిల్లీ కూడా అట్టుడుకుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి అంతటి వాడినే అరెస్టు చేసిన తర్వాత.. పోల్చిచూస్తే కల్వకుంట్ల కవిత ఒక లెక్కనా? అందుచేత గులాబీదళాలు చిందులు వేయడం ఇక తగ్గించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు అనేది ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని నెలలనుంచి జైలులోనే గడుపుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అరెస్టు అయ్యారు. అవినీతికి పాల్పడిన తర్వాత ఎంతటి పెద్ద తలకాయలైనా చట్టం ముందు తలవంచాల్సిందే అని ఈ అరెస్టులు నిరూపిస్తున్నాయి. కానూన్ కా హాథ్ బహుత్ లంబా హై అంటే బహుశా ఇదే.
ఢిల్లీలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏదో తన మానాన తాను పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఈలోగా సౌత్ సిండికేట్ ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు తీసుకురావడానికి ఒక పెద్ద ప్రతిపాదనతో ప్రభుత్వం వద్దకు వెళ్లింది. తెలంగాణలో అమలవుతున్న లిక్కర్ పాలసీనే ఢిల్లీలో కూడా కార్యరూపంలోకి తీసుకురావాలనేది వారి ప్రతిపాదన. దీని వలన ప్రభుత్వానికి కూడా లిక్కర్ వ్యాపారం ద్వారా ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ఆదాయం పెరగడం సంగతి తర్వాత.. మొత్తానికి వంద కోట్ల రూపాయల లంచాలు ఇవ్వజూపారు. తెలుగు రాష్ట్రాల్లో పరిణామాల, వ్యవహారాలు వార్తలు చూస్తూ గడిపే వారికి.. వందకోట్లు అనేది పెద్దగా ఆనకపోవచ్చు. కానీ ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలకు అదే పెద్ద మొత్తం. లోబడ్డారు. కల్వకుంట్ల కవిత, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి తదితరులు అనేకులు ఒక సిండికేట్ గా ఏర్పడి ఆ ముడుపుల పర్వాన్ని పూర్తిచేశారు. ఈలోగా వ్యవహారం బయటపడింది.
సీబీఐ, ఈడీ రంగంలోకి వచ్చిన తర్వాత.. అరెస్టులు మొదలయ్యాయి. శరత్, రాఘవ లాంటివాళ్లు అప్రూవర్లుగా మారారు. అందరి పాత్రలూ విపులంగా దర్యాప్తు సంస్థలకు చేరాయి. వారు దర్యాప్తు సాగిస్తూ, తప్పించుకోవడానికి ఉండగల ఒక్కొక్క మార్గాన్ని మూసివేసుకుంటూ.. వారం రోజుల కిందట కవితను అరెస్టు చేశారు.
నిజాయితీగల అధికారిగా అపరిమిత గుర్తింపు తెచ్చుకుని రాజీకాయల్లోకి వచ్చి తన క్రెడిబిలిటీతోనే అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్.. ఈ అరెస్టును తప్పించుకోవడానికి నానా పాట్లు పడ్డారు. ఈడీ ఆయనకు ఏకంగా తొమ్మిది సార్లు నోటీసులు పంపినా ఆయన స్పందించలేదు. దర్యాప్తుకు సహకరించలేదు. ప్రతిసారీ విచారణ ఎగ్గొట్టడానికి కోర్టును ఆశ్రయించారు.
చివరికి ఈ కేసు విచారిస్తున్న ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు గానీ, హైకోర్టు గానీ.. విచారణను అడ్డుకోలేమని, ఆయనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని తేల్చేశాయి. హైకోర్టు తీర్పు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన నివాసానికి వెళ్లడం, సోదాలు, విచారణ తర్వాత అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఆయన సుప్రీంను కూడా ఆశ్రయించారు గానీ.. విచారణ శుక్రవారానికి షెడ్యూలు కావడంతో అరెస్టు తప్పించుకోలేకపోయారు.
ఈ దేశంలో అరెస్టు అయిన ఆరో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మిగిలిన అయిదుగురు ముఖ్యమంత్రులు కూడా పదవికి రాజీనామా చేసిన అరెస్టు కాగా, పదవిలో ఉంటూ అరెస్టు అయిన తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రికార్డు సృష్టించారు.