టీడీపీ, జ‌న‌సేనలో తీవ్ర నిరుత్సాహం!

బీజేపీతో పొత్తు ల‌క్ష్యం నెర‌వేర‌లేద‌ని టీడీపీ, జ‌న‌సేన తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. ఏపీలో బీజేపీకి ఏ మాత్రం బ‌లం లేకున్నా, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామ‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. వ్య‌వ‌స్థ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌నే ఒకే ఒక్క కార‌ణంతో పొత్తు పెట్టుకున్న‌ట్టు ఆ పార్టీల నాయ‌కులు అంటున్నారు. అయితే ఆశించిన స్థాయిలో మ‌ద్ద‌తు ల‌భించ‌లేద‌ని వారు వాపోతున్నారు.

తాజాగా జ‌న‌సేన గుర్తు గాజుగ్లాసు విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుస‌రించిన వైనాన్ని ఉద‌హ‌రిస్తున్నారు. గాజుగ్లాసును ఫ్రీ సింబ‌ల్‌గా ఉంచి, దాన్ని ఇత‌ర పార్టీలు, స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు కేటాయించ‌డాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. కీల‌క‌మైన గుర్తుల విష‌యంలో కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌హ‌క‌రించ‌క‌పోతే, ఇక బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్ర‌యోజ‌నం ఏంట‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు నిల‌దీస్తున్నారు.

ఫ్రీ సింబ‌ల్‌గా ఉంచిన గాజు గ్లాసును, జ‌న‌సేన‌కు త‌ప్ప ఇత‌రుల‌కు కేటాయించొద్ద‌ని ప‌దేప‌దే రాష్ట్ర‌, కేంద్ర ఎన్నిక‌ల అధికారుల‌కు విన్న‌వించ‌డాన్ని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు గుర్తు చేస్తున్నారు. అన్నీ విన్న‌ట్టే విని, తీరా గుర్తులు కేటాయించే స‌మ‌యానికి య‌ధావిధిగా జ‌న‌సేన బ‌రిలో లేని అసెంబ్లీ, లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇత‌రుల‌కు కేటాయించార‌ని ఆ రెండు పార్టీల నేత‌లు వాపోతున్నారు. దీనివ‌ల్ల కూట‌మికి రాజ‌కీయంగా న‌ష్టం సంభ‌విస్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

క‌నీసం ఇంత చిన్న సాయం కూడా చేయ‌క‌పోతే, బీజేపీతో పొత్తు ఎందుక‌ని వారు నిల‌దీస్తున్నారు. అదేమంటే... కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్వ‌తంత్ర వ్య‌వ‌స్థ అని నీతులు చెబుతున్నార‌ని బీజేపీపై టీడీపీ, జ‌న‌సేన నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు వ్య‌వ‌స్థ‌ల స‌హ‌కారం లేక‌పోవ‌డం చూస్తే, అస‌లు బీజేపీతో పొత్తు ఉందా? లేదా? అనే అనుమానం క‌లుగుతోంద‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు మండిప‌డుతున్నారు. ఇలాగైతే త‌మ‌కు ఇబ్బందులు త‌ప్పేలా లేవ‌ని వారు ఆందోళ‌న చెందుతున్నారు.

Readmore!

Show comments