గంటాకు గలాస్ తో లాస్ ఎంత?

భీమినిపట్నం సీటుని ఏరి కోరి తెచ్చుకుని పోటీ చేస్తున్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి రూపంలో ఇబ్బంది ఎదురవుతోంది అంటున్నారు. స్థానికంగా ఉన్న  ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

పద్మనాభ, భీమిలీ మండలల్లో అధిక సంఖ్యలో ఉండే ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయనకు ఈ గుర్తు రావడంతో గాజు గ్లాస్ టీడీపీ కొంప ముంచుతుందని అంటున్నారు. 2019లో భీమిలీ నుంచి జనసేన పోటీ చేస్తే పాతిక వేల ఓట్ల దాకా వచ్చాయి. అంతలా గాజు గ్లాస్ పాపులర్ అయింది.

ఇప్పుడు అందులో సగం అయినా ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్ధి చీలిస్తే ఆ మేరకు టీడీపీకి బిగ్ లాస్ తప్పదని అంటున్నారు. పైపెచ్చు ఈ మధ్య దాకా తమకే టికెట్ వస్తుందని భావించి జనసేన నేతలు గాజు గ్లాస్ తో జనంలోకి వెళ్ళి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. అలా గాజు గ్లాస్ అందరికీ గుర్తుండిపోయింది.

దీంతో వద్దు అన్నా ఓట్లు వేలల్లోనే పడతాయా అన్న చర్చకు తెర లేచింది. గంటా తన సెంటిమెంట్ ని పక్కన పెట్టి పోటీ చేసిన చోటనే రెండవసారి చేస్తున్నారు. ఆయన 2014 నుంచి 2019 మధ్యలో ఎమ్మెల్యేగా మంత్రిగా జనాలకు అందుబాటులో ఉండలేదని విమర్శలను వైసీపీ చేస్తోంది. దీని మీద జనాలలో కూడా ఆయన మీద కొంత అసంతృప్తి ఉందని అంటున్నారు.

Readmore!

మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరరావు జనంలో నిరంతరం ఉంటూ పట్టు సాధించారు. ఆయనతో గంటాకు ఈసారి టైట్ ఫైట్ నడుస్తుంది అని అంతా అనుకుంటున్న నేపథ్యంలో గాజు గలాస్ సడెన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ గలాస్ ఎవరికి గుచ్చుకుంటుందో ఏ విధంగా కొంప ముంచుతుందో తెలియదు. టీడీపీ శిబిరంలో మాత్రం గాజు గలాస్ తెగ కలవరం పెడుతోంది అని అంటున్నారు.

Show comments