ఏమిటిది చంద్రబాబూ.. మాయా? మోసమా?

చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ లాగానే ఆరు పేజీల మేనిఫెస్టో ఇది. అయితే మేనిఫెస్టోలో ఎక్కడా తెలుగుదేశం పార్టీ పేరు గానీ, భారతీయ జనతా పార్టీ పేరు గానీ లేనేలేవు. కేవలం రెండు చోట్ల జనసేన పార్టీ పేరును మాత్రం ప్రస్తావించారు. ఆ ప్రస్తావన కూడా జనసేన అడిగి రాయించుకున్నట్టుగా ఉంది.

తమ పార్టీ పేరు లేకపోతే క్రెడిట్ మొత్తం చంద్రబాబు కొట్టేస్తాడని పవన్ భయపడుతున్నట్టుగా ఉంది. అయితే మేనిఫెస్టోలో తెలుగుదేశం పేరు కూడా లేకుండా రూపొందించిన డిజైన్ ను జాగ్రత్తగా గమనిస్తే.. క్రెడిట్ కాదు కదా.. ఈ హామీలకు ‘ఆన్ పేపర్’ పూచీ తీసుకోవడానికి చంద్రబాబునాయుడు సిద్ధంగా లేరనీ, తన పార్టీ పేరును కూడా ఆయన ‘కమిట్’ చేయించదలచుకోలేదని అర్థమవుతోంది.

ఆరు పేజీల మేనిఫెస్టో అది. కవరు పేజీ మీద మోడీ ఫోటో లేకపోవడం ఒక్కటే అందరూ గమనిస్తున్నారు. దీని గురించి ఇప్పటికే రాద్ధాంతం అవుతోంది. మోడీ తన ఫోటో వేయవద్దని చాలా స్ట్రాంగుగా ఆదేశించారని జగన్మోహన్ రెడ్డి రహస్యాన్ని బయటపెట్టారు కూడా.

మేనిఫెస్టో విడుదలకు కనీసం బిజెపి రాష్ట్ర నాయకులు ఎవ్వరూ హాజరు కాలేదు. రాష్ట్ర పార్టీ ఇన్చార్జి హాజరయ్యారు కానీ.. మేనిఫెస్టో కాపీని చేత్తో ముట్టుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అంటే .. చంద్రబాబు ఇస్తున్న హామీలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని బిజెపి స్పష్టం చేయదలచుకున్నట్టు అర్థమవుతోంది.

Readmore!

తమాషా ఏంటంటే.. దానికి తగ్గట్టుగానే బిజెపి పార్టీ పేరు కూడా మేనిఫెస్టోలోని ఆరుపేజీల్లో ఎక్కడా లేనేలేదు. జనసేన పార్టీ పేరును మాత్రం రెండుచోట్ల ప్రస్తావించారు. ముందుమాటలో.. ‘జనసేన సూచించిన షణ్ముఖ వ్యూహం’ అని రాశారు. జనసేనకు వచ్చిన వినతులన్నీ క్రోడీకరించామని చిట్టచివరి పేజీలో ఒక వాక్యం రాశారు.

గొప్ప కామెడీ ఏంటంటే.. తెలుగుదేశం పార్టీ పేరు ఒకేచోట ఉంది. తెలుగుదేశం కార్యక్రమాల్ని జగన్ రద్దు చేశారు అనడానికి తప్ప ఆ పార్టీ పేరు వాడలేదు. ఇంతకూ ఇది తెలుగుదేశం ఇస్తున్న హామీ , ఇందులోని వరాలన్నింటికీ పూచీ మా పార్టీలది అని పేర్లు కూడా ఎక్కడా పెట్టలేదు.

గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సంతకంతో విడుదల చేసిన మేనిఫెస్టోలకే దిక్కూదివాణం లేకుండా పోయింది. ఇప్పుడు ఏదో చిన్న పిల్లల ఆటలాగా ఈ హామీలకు ఎవ్వరు బాధ్యత తీసుకుంటారో ఏమాత్రం చెప్పకుండా విడుదల చేస్తే ప్రజలు ఎలా నమ్ముతారు? చంద్రబాబు మాయ చేయదలచుకుంటున్నారా? మోసం చేయదలచుకుంటున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Show comments