కూట‌మి ప్రెస్‌మీట్ నాలుగు గంట‌ల జాప్యం.. ఏం జరిగిందంటే?

కూట‌మి మేనిఫెస్టో నాలుగు గంట‌లు జాప్యం జ‌రిగింది. దీని వెనుక పెద్ద త‌తంగ‌మే జ‌రిగింద‌ని కూట‌మి విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ నెల 30న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు కూట‌మి మేనిఫెస్టోను చంద్ర‌బాబునాయుడు నివాసంలో విడుద‌ల చేస్తార‌ని ఒక రోజు ముందే మీడియాకు స‌మాచారం ఇచ్చారు. దీంతో మ‌ధ్యాహ్నం నుంచి మీడియాతో పాటు రాష్ట్ర ప్ర‌జానీకం ఎదురు చూడ‌సాగింది.

ఇదిగో అదిగో అంటూ తీవ్ర జాప్యం చేశారు. ఈ నాలుగు గంట‌ల మ‌ధ్య కాలంలో ఏం జ‌రిగిందని ఆరా తీయ‌గా... పెద్ద త‌తంగ‌మే చోటు చేసుకున్న‌ట్టు తెలిసింది. మేనిఫెస్టో విడుద‌ల‌కు సంబంధించి మోదీ పెద్ద ఫొటోను ప్లెక్సీలో పెట్టిన‌ట్టు స‌మాచారం. అయితే మేనిఫెస్టోలో భాగ‌స్వామ్యం లేని త‌మ‌ను ఎందుకు తెర‌పైకి తెస్తున్నార‌ని బాబు, ప‌వ‌న్‌ల‌ను బీజేపీ పెద్ద‌లు నిల‌దీసిన‌ట్టు తెలిసింది. మీడియా కాన్ఫ‌రెన్స్‌లో పెట్టే ప్లెక్సీలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మోదీ ఫొటో పెట్టొద్ద‌ని వార్నింగ్ ఇచ్చి, మ‌రీ దాన్ని మార్చేశార‌ని స‌మాచారం.

అలాగే మేనిఫెస్టో విడుద‌ల‌కు తాము హాజ‌ర‌య్యేది లేద‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల‌కు బీజేపీ పెద్ద‌లు తేల్చి చెప్పారు. దీంతో వాళ్లిద్ద‌రు షాక్‌కు గురైన‌ట్టు తెలిసింది. ఇలాగైతే త‌మ మేనిఫెస్టోకు విలువ వుండ‌ద‌ని బీజేపీ పెద్ద‌ల‌కు మొర‌పెట్టుకున్న‌ట్టు తెలిసింది. తామేం చేయ‌లేమ‌ని, మేనిఫెస్టో అమ‌లు మంచీచెడుల‌కు మీరే బాధ్య‌త వ‌హించాల‌ని తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం.

ఈ ప‌రిణామాల్ని ఊహించ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు అస‌లేం జ‌రుగుతున్న‌దో అర్థం కాలేద‌ట‌. చివ‌రికి ఎంతో ప్రాథేయ‌ప‌డి బీజేపీ రాష్ట్ర స‌హ ఇన్‌చార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్‌ను పాల్గొనేలా బీజేపీ పెద్ద‌ల్ని ఒప్పించారు. అందుకే మేనిఫెస్టో ప్ర‌తిని ఆయ‌న ట‌చ్ చేయ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని వైనాన్ని అంద‌రూ చూశారు. ప్రెస్‌మీట్ నాలుగు గంట‌ల జాప్యం వెనుక ఇంత త‌తంగం జ‌రిగింద‌న్న మాట‌.

Readmore!

Show comments