రీల్స్ పిచ్చి.. గుండెల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్

రీల్స్ పిచ్చిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూశాం. రన్నింగ్ ట్రయిన్ పక్కన నిల్చొని, నదిలో ప్రయాణిస్తూ, రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ, ఇలా ఎన్నో ప్రమాదకర పరిస్థితుల్లో రీల్స్ చేస్తూ మృత్యువాత పడిన ఘటనలు చూశాం. మరింత ప్రమాదకర ఘటన తాజాగా రాజస్థాన్ లో వెలుగుచూసింది.

రాజస్థాన్ లోని కోటాలో డిగ్రీ చదువుతున్నాడు యశ్వంత్ అనే 22 ఏళ్ల యువకుడు. జలావర్ జిల్లాకు చెందిన ఈ వ్యక్తి కోటాలో ఉంటూ డిగ్రీ పూర్తిచేస్తున్నాడు. ఫ్రెండ్స్ తో కలిసి రీల్స్ చేయడం ఇతడికిష్టం. అయితే ఈసారి మరింత క్రేజీగా రీల్స్ చేయాలని భావించాడు.

అనుకున్నదే తడవుగా స్నేహితులతో కలిసి తుపాకీ సంపాదించాడు. అదొక నాటు తుపాకీ. దాంతో అత్యంత సహజంగా రీల్స్ చేయాలని భావించాడు యశ్వంత్. ఓ టీ స్టాల్ దగ్గర దీనికి సంబంధించి రిహార్సల్స్ మొదలుపెట్టారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ తుపాకీ పేలింది. బుల్లెట్ నేరుగా యశ్వంత్ గుండెల్లోకి దూసుకుపోయింది.

వెంటనే యశ్వంత్ ను స్థానిక హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. జరిగిన ఘటనపై కోట పోలీసులు కేసు నమోదు చేశారు. డిగ్రీ చదువుతున్న కుర్రాళ్లకు తుపాకీ ఎక్కడ్నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తుపాకీ పేలిన సమయంలో అది ఎవరి చేతిలో ఉందనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. రీల్స్ పిచ్చిలో మరో యువకుడు తన ప్రాణాలు కోల్పోయాడు. 

Readmore!

Show comments

Related Stories :