చ‌క్క‌గా సిగ్గు లేకుండా ఉన్నాయి

మాయ‌బ‌జార్‌లో ఓ డైలాగుంది. మాయ‌శ‌శిరేఖ విన్యాసాలు చూసిన శ‌కుని "చ‌క్క‌గా సిగ్గు లేకుండా వున్నావ్" అంటాడు. ఈ పోలిక క‌రెక్ట్‌గా ఈనాడు, ఆంధ్ర‌జ్యోతికి స‌రిపోతుంది. ప్ర‌జాస్వామ్యం, జ‌ర్న‌లిజం పేరుతో అన్ని విలువ‌ల్ని వ‌దిలేసి, నిజాలు దాచేసి, అబ‌ద్ధాలని సిగ్గు లేకుండా ప్ర‌చారం చేస్తున్నాయి. ఈ స్థాయిలో దిగ‌జార‌డం వాటి చ‌రిత్ర‌లో ఏనాడూ లేదు. ఇక జార‌డానికి  కూడా ఏమీ లేదు.

స్వ‌ప్ర‌యోజ‌నాల ముసుగుకి, ప్ర‌జాక్షేమం క‌ల‌రింగ్ ఇస్తున్నాయి. నిన్న‌మొన్న‌టి దాకా జ‌గ‌న్‌ని బ‌ట‌న్ రెడ్డి అని వీళ్లే ఎద్దేవా చేసారు. నొక్కుడు, పంచుడు అన్నారు. ఆర్థిక‌వేత్త‌ల‌ని తెచ్చి పేజీల కొద్ది ఇంట‌ర్వ్యూలు వేసారు. రాష్ట్రంలో శ్రీ‌లంక త‌ర‌హా విధ్వంసం అన్నారు. వెనిజులాని ఉదాహ‌ర‌ణ‌గా చూపారు. ప్ర‌జ‌లు సోమ‌రిపోతులుగా మారుతున్నార‌ని ఎగ‌తాళి చేశారు. పంచుడు త‌ప్ప పాల‌న ఎక్క‌డ‌? అని నిల‌దీశారు.

జ‌నానికి అన్నీ గుర్తున్నాయి. ఇవేవీ గుర్తు లేక హ‌ఠాత్తుగా ప్లేటు మార్చి చంద్ర‌బాబుని సూప‌ర్‌సిక్స్ అంటూ పొగ‌డ్త‌లు అందుకున్నాయి. జ‌రుగు జ‌గ‌న్ అంటూ ప్ర‌క‌ట‌న‌లు. ఖాళీ చెయ్యి కుర్చీ అంటున్నారు. కుర్చీలో కూర్చోగానే బాబు జ‌నాల్ని ఖాళీ చేస్తారు.

చంద్ర‌బాబు మానిఫెస్టో గ్రాఫిక్స్ అని అంద‌రికీ అర్థ‌మ‌వుతున్నా, జ‌ర్న‌లిజంలో కొమ్ములు తిరిగిన ఈనాడుకి మాత్రం అర్థం కావ‌డం లేదు. అర్థ‌మైనా కాన‌ట్టు న‌ట‌న‌. ఎందుకంటే అర్జెంట్‌గా జ‌గ‌న్ దిగిపోవాలి. లేదంటే ప‌ప్పులుడ‌క‌వు. ప్ర‌జ‌ల సంగ‌తి మ‌న‌కెందుకు? న‌మ్మితే మునిగిపోతారు. ముంచ‌డం బాబుకు కొత్త కాదు. ఆయ‌న హ‌యాంలో మున‌గ‌డం ప్ర‌జ‌ల‌కి కొత్త కాదు.

Readmore!

స‌ర్వ‌జ‌నుల సంక్షేమం కోసం బాబు రావాల‌ట‌. స‌ర్వ‌జ‌నుల‌కి బ‌దులు, స్వ‌జ‌నం అని పెడితే క‌రెక్ట్.

ఈనాడు అబ‌ద్ధాల‌కి హ‌ద్దూప‌ద్దూ లేదు. నిజాలు రాయ‌డం మ‌రిచి చాలా కాల‌మైంది. వైసీపీ ఎన్నిక‌ల్ని వ్యాపారంగా మార్చేసింద‌ని బ్యాన‌ర్‌. అస‌లు ఈ రాష్ట్రంలో ఎన్నిక‌ల్ని పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చింది చంద్ర‌బాబే. డ‌బ్బు తీసుకుని టికెట్లు ఇవ్వ‌డం, డ‌బ్బున్న వాళ్ల‌కే టికెట్లు ఇవ్వ‌డం ఆయ‌న‌తోనే మొద‌లు.

ఈ సారి కూడా పెమ్మ‌సాని, కృష్ణ‌దేవ‌రాయలు, వేమిరెడ్డి, మాగుంట‌, కేశినేని చిన్ని వీళ్లంతా ఎన్నిక‌ల్లో డ‌బ్బు ఖ‌ర్చు పెట్ట‌డానికి కాక‌పోతే ఇంకెందుకు? అనంత‌పురంలో పార్టీకి ఏళ్ల త‌ర‌బ‌డి ప‌ని చేస్తున్న ప్ర‌భాక‌ర్ చౌద‌రిని కాద‌ని, ద‌గ్గుబాటి ప్ర‌సాద్‌కు ఇవ్వ‌డానికి డ‌బ్బు కాకుండా ఇంకేదైనా కార‌ణం వుందా? ఈనాడు అతి తెలివి ఏమంటే వైసీపీ ఓటుకి ఐదు వేల నుంచి ప‌ది వేల వ‌ర‌కు ఇస్తుంద‌నే ప్ర‌చారాన్ని జ‌నాల్లోకి తీసుకెళితే, అంత ఇవ్వ‌లేక అభ్య‌ర్థులు ఇరుకున ప‌డ‌తార‌ని.

ఆర్థిక నిపుణుడు పీవీ ర‌మేశ్ ప్ర‌సంగాలు రోజూ ప్ర‌చురించే ఈనాడు, అదే నిపుణుడితో చంద్ర‌బాబు ఏటా రూ.1.50 ల‌క్ష‌ల కోట్లు ఎలా పంచుతాడో ఒక ఇంట‌ర్వ్యూలో వివ‌రిస్తే బాగుంటుంది.

జ‌న‌హిత‌మే ఎజెండా పేరుతో మానిఫెస్టోల‌ని పోలుస్తూ అర పేజీ ప‌రిచిన ఈనాడులో 2014లో బాబు త‌న మానిఫెస్టోని ఏ మాత్రం అమ‌లు చేసాడో వివ‌రిస్తే బాగుండేది. ఆ ప‌ని సాక్షి ఎలాగూ చేస్తుంద‌ని వ‌దిలేసి వుంటారు.

ప్ర‌తి ఇంటికీ మూడు గ్యాస్ సిలిండ‌ర్లు ఉచితంగా ఇస్తాన‌ని బాబు ప్ర‌క‌టించారు. అయితే మానిఫెస్టో మొత్తం గ్యాసే అని ఆయ‌న‌కి తెలిసిన‌ట్టు లేదు.

ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల‌కు బాబుని స‌మ‌ర్థిస్తూ ఏమైనా రాసే హ‌క్కు వుంది. వాళ్ల పేప‌ర్‌, వాళ్లిష్టం. అయితే జ‌ర్న‌లిజం, ప‌త్రికా విలువ‌లు, స‌త్య‌శోధ‌న‌, ప్ర‌జాక్షేమం ఇలాంటి డూప్లికేట్ ప‌దాల్ని వాడ‌కుండా వుంటే ఎవ‌రికీ ఏ అభ్యంత‌రం లేదు. ప‌త్రిక కూడా వ్యాపార‌మే. డ‌బ్బుల కోసం అక్ష‌రాలు అమ్ముకుంటాం అని ఒప్పుకుంటే గౌర‌వం. అదే నేడు న‌డుస్తున్న జ‌ర్న‌లిజం.

Show comments