గంటా గెలిస్తే ఇంచార్జి పాలనేనా?

ఇంచార్జి పాలన ఏంటి కొత్తగా ఉంది అనుకుంటే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెలిచిన నియోజకవర్గాలకు ఒకసారి వెళ్తే చాలు అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తం బోధపడిపోతుంది అని చెబుతున్నారు. గంటా ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండరని వైసీపీ నేతలు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అవి ఒట్టి విమర్శలు కావు పచ్చి నిజాలు అని అంటున్నారు.

గంటా ఎమ్మెల్యే అయితే ఆయన దర్శనం ప్రజలకు దొరకడం కడు దుర్లభం అని కూడా చెబుతున్నారు. భీమిలీలో గంటా వర్సెస్ అవంతి గా రాజకీయ పోరు సాగుతోంది. ఇద్దరి పేర్లూ శ్రీనివాసరావులే. ఇద్దరూ ఓటమి ఎరగని వీరులే. గంటా ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన అవంతి ఈసారి తాను భీమిలీ నుంచి గెలుస్తాను అని ధీమాగా చెబుతున్నారు.

గంటాకు తొలి ఓటమి రుచి తానే చూపిస్తాను అని అంటున్నారు. అవంతికి ప్లస్ పాయింట్ జనంలో ఉండడం. ఎవరు ఏ టైం లో వచ్చినా నేరుగా కలుసుకోవడం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. మీకు ఎమ్మెల్యే కావాలా ఎమ్మెల్యే తరఫున పెట్టే ఇంచార్జిలు కావాలా అని వైసీపీ నేతలు భీమిలీలో చేస్తున్న ప్రచారంతో రాజకీయం గరం గరంగా మారింది.

అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా గంటాకు అర్ధబలం అంగబలం ఉన్నా ఈ నెగిటివ్ ప్రచారం కొంప ముంచుతుందా అని టీడీపీలో ఆందోళన నెలకొంటోంది. గంటా పోటీ చేసి గెలిచిన చోట మళ్లీ పోటీకి దిగరు. భీమిలీలో మాత్రమే రెండవసారి పోటీ చేస్తున్నారు. దాంతో ఆయన 2014 నుంచి 2019 దాకా ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన పాలనను జనాలకు గుర్తు చేస్తూ గంటాని వైసీపీ తెలివిగా ఇరకాటంలో పెడుతోంది.

Readmore!

గంటాను గెలిపిస్తే ఎవరో ఒకరికి ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించి ఆయన కనిపించకుండా పోతారని అందుకే ఆయనకు ఓటు వేయవద్దు అని ప్రచారం చేస్తోంది. గంటా ఎమ్మెల్యే గిరీ మంత్రిగా పనితీరు ఇప్పుడు జనాలు నెమరేసుకుంటున్నారు. వారు అన్నీ ఆలోచించుకుని వైసీపీకే ఓట్లు వేసి గెలిపిస్తారు అని ఆ పార్టీ నమ్మకంగా ఉంది. గంటాతో పాటు టీడీపీ నేతలు అయితే తాము అందుబాటులోనే ఉంటామని చెబుతున్నారు కానీ గత అనుభవాలతో జనాలు కొత్తగా ఆలోచిస్తే మాత్రం భీమిలీలో జే గంట మోగేది ఉంటుందా అన్న డౌట్లు వ్యక్తం అవుతున్నాయట.

Show comments