ఎన్నికల వేళ జూనియర్ ఎన్టీఆర్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. అటు టీడీపీ నేతలతో పాటు, ఇటు కొడాలి నాని లాంటి వైసీపీ నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. అతడి ఫ్యాన్స్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సందర్భంగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. ఎన్టీఆర్ అభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాని.. తెలుగుదేశం పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి రావాలంటే, ప్రస్తుతం చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు.
"తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులంతా కష్టపడి గెలిపిస్తే ఏం జరుగుతుంది? ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను తుంగలో తొక్కుతారు. చంద్రబాబు కొడుకు లోకేష్ ను అధికారంలో కూర్చోబెడతారు. అందుకే ఎన్టీఆర్ అభిమానులు గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పగ్గాలు పట్టుకుంటేనే, అతడి అభిమానులు ఆ పార్టీకి మద్దతివ్వాలి. తెలుగుదేశం పగ్గాలు ఎన్టీఆర్ కు రావాలంటే చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి. పెద్ద ఎన్టీఆర్ ను దుర్మార్గుడని, తెలుగుదేశం పార్టీకి పనికిరాడని మెడ పట్టి బయటకు గెంటి పార్టీని లాక్కున్న ఈ చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని, టీడీపీ పగ్గాలు అప్పగించేలా ఫ్యాన్స్ బుద్ధిచెప్పాలి."
భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించే క్రమంలో ఆమె పేరు చెప్పలేదని జూనియర్ ఎన్టీఆర్ ను సోషల్ మీడియాలో చంద్రబాబు తిట్టించాడని ఆరోపించారు కొడాలి నాని. తన సభల్లో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కనిపిస్తే, ఫ్యాన్స్ ను తన్నితరిమేసిన చంద్రబాబు... ఎన్నికలు వచ్చేసరికి అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లు కోసం ఎగబడుతున్నారని ఆరోపించారు.
గతంలో జరిగిన ఇలాంటి ఘటనలన్నింటినీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనసులో పెట్టుకొని, వాటిని గుర్తుచేసుకొని నిర్ణయం తీసుకోవాలని కోరారు నాని. టీడీపీని ఓడించి, తన ఫ్రెండ్ ఎన్టీఆర్ కు గిఫ్ట్ గా ఇస్తానని ఈ సందర్భంగా కొడాలి నాని శపథం చేశారు.