పశ్చిమం గణగణ మోగేనా?

ఎన్నికలు అంటే ప్రజలు తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పేవి. అయిదేళ్ల పాటు వారు అన్నీ చూస్తారు. అంతా గమనిస్తారు. తమకు మేలు చేసేది చూస్తారు. అయిదేళ్ల పాటు ప్రజా ప్రతినిధిగా పనిచేసిన వారు మరోసారి ప్రజల వద్దకు వెళ్లడం అంటే పరీక్ష రాయడమే. కొంతమందికి అది అగ్ని పరీక్ష కూడా అవుతుంది.

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే రెండు సార్లు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న ఎమ్మెల్యే గణబాబుకు అంతా అనుకూలమేనా అన్న దాని మీద పసుపు శిబిరంలో చర్చోప చర్చలు సాగుతున్నాయి. సహజంగానే పదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉంటే యాంటీ ఇంకెబెన్సీ ఉంటుంది.

ఇపుడు ధీటైన ప్రత్యర్ధి వైసీపీ నుంచి ఉన్నారు. అదే సామాజిక వర్గం, పైగా అంగ బలం అర్ధ బలం దండిగా ఉన్న వారు. ప్రజలకు సేవ చేస్తాను అని ముందుకు వస్తున్న కొత్త ముఖం. విశాఖ డైరీ చైర్మన్ గా పరిచయం ఉన్నవారు. దాంతో విశాఖ పశ్చిమంలో టీడీపీకి ఈసారి కొంత ఎదురీత తప్పదని అంచనాలు వెలువడుతున్నాయి.

ఈసారి గండం గట్టెక్కితే నెగ్గేసినట్లే అన్న మాట వినిపిస్తోంది. గణబాబు మీద సొంత పార్టీలోనూ అసంతృప్తి ఉందని అంటున్నారు. సామాజికవర్గాల పరంగా సమీకరణలలో చూస్తే కొంత ప్రతికూలత కనిపిస్తోంది అంటున్నారు. ఈసారి వీటిని అధిగమించడం కష్టంగా మారుతుంది అని లెక్క వేస్తున్నారు.

Readmore!

విశాఖలో చైతన్యవంతమైన నియోజకవర్గాలలో ఒకటిగా ఉన్న పశ్చిమలో ఈసారి అనూహ్యమైన ఫలితం వస్తుందని అంటున్నారు. గతసారి పాతిక వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలిచింది. ఈసారి మాత్రం పూల పానుపు కాదని అంటున్నారు. బలమైన ప్రత్యర్ధిగా వైసీపీ ఉంది. విజయం వైపుగా దూసుకుని వస్తోంది. దాంతో విశాఖ పశ్చిమం నుంచే వైసీపీ జయ జయ నాదాలు వినిపిస్తాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Show comments