పిఠాపురంలో జగన్ ప్రసంగం ఆద్యంతం అభిమాన జనాలను ఆకట్టుకునేలా సాగింది. ఇక నేను చేయగలిగింది అంతా చేసాను. చెప్పాల్సింది అంతా చెప్పాను..ఇక మీ ఇష్టం అనేలాంటి చిన్న వణుకు, ఉద్వేగం ప్రసంగంలో చోటు చేసుకున్నాయి.
ప్రసంగం ముగించిన తరువాత అక్కా.. చెల్లీ.. తల్లీ..అన్నా..తమ్ముడూ అంటూ పదే పదే ఫ్యాన్ గుర్తును గుర్తు చేస్తున్నపుడు జగన్ కాస్త ఉద్వేగానికి గురయినట్లు క్లియర్ గా తెలిసి వచ్చింది. ఎన్నికల ప్రచారం ముగుస్తోంది. పిఠాపురం సభ తరువాత ఇక ప్రచారం మూగబోతుంది. పిఠాపురం సభ స్పీచ్ ను రాష్ట్రం అంతా చూస్తూ వుంటుందని జగన్ కు తెలుసు. అందుకే ఈ ప్రసంగాన్ని కాస్త పదునుగానే చేసారు.
ఘాటు పదజాలం వాడారు. అది కూడా పదునుగా, పరుషంగానే. వంగా గీత ను గెలిపిస్తే డిప్యూటీ సిఎమ్ ను చేసి, నియోజకవర్గానికి పంపిస్తాను అని జగన్ హామీ ఇచ్చారు. నిజానికి ఇలాంటి హామీ గతంలో కూడా జగన్ ఇచ్చారు. కానీ కొన్ని చోట్ల నిలబెట్టుకున్నారు. కొన్ని చోట్ల నిలబెట్టుకోలేదు. అందువల్ల దీనికి పెద్దగా ప్రాధాన్యత వుంటుంది అని అనుకోవడానికి లేదు.
అయితే ఇదే సభలో వంగా గీత కూడా కాస్త ఉద్వేగంగా ప్రసంగించారు. తను చనిపోతే తను పిఠాపురం పాదగయ పక్కనే అంత్యక్రియలు చేయాలని అన్నారు. తను పిఠాపురం పక్కా లోకల్ అనే విషయాన్ని జనాల్లోకి పంపడానికి ఆమె ఈ మాట వాడారు అనుకోవాలి. తనను అవమానిస్తున్నారని, బాధపెడుతున్నారని వాపోయారు.
మొత్తం మీద పిఠాపురం జగన్ సభలో ప్రసంగాలు కాస్త ప్రభావవంతగానే వున్నాయి.