ఉమ్మడి విశాఖ జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఎన్నికల చిత్రం చరిత్ర పుటలలో పదిలంగా ఉంది. లక్ అన్న మాటకు అసలైన అర్ధంగా ఆ ఎన్నిక ఫలితం ఉంది అని చెప్పవచ్చు. అది 1989 సంవత్సరం ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. లోక్ సభకు అసెంబ్లీకి ఒకేసారి ఆ ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో దేశమంతా విపక్ష కూటమికి అనుకూల గాలులు వీస్తే ఏపీలో కాంగ్రెస్ అనుకూల పవనాలు బలంగా వీచాయి.
అయినా ఉమ్మడి విశాఖలోని అనకాపల్లి ఎంపీ సీటులో పోటా పోటీగా టీడీపీ కాంగ్రెస్ పార్టీల మధ్య భీకర పోరు సాగింది. రెండు పార్టీలకూ ప్రతీ రౌండ్ లో ఒకరికి ఒకరు తీసిపోకుండా ఓట్లు వచ్చాయి. ఆఖరి రౌండ్ లో సైతం రెండు పార్టీలకు దాదాపుగా సమానంగా వచ్చాయి. దాంతో పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తే అందులోనూ పోటా పోటీ వాతావరణమే.
చివరికి అక్కడ కాంగ్రెస్ కి ఆధిక్యత లభించింది. కేవలం తొమ్మిది అంటే తొమ్మిది ఓట్లే తేడాతో అనకాపల్లి ఎంపీ సీటుని ఆనాడు కాంగ్రెస్ కైవశం చేసుకుంది. ఇప్పటికీ అదే ఒక అరుదైన ఎన్నికల రికార్డుగా ఉంది. ఆనాటి ఆ ఎన్నికల ఫలితం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలోకి ఎక్కింది.
రాజకీయాల్లో జక్ పాట్ ఉంటుందా అన్న వారికి ఈ ఎన్నిక ఒక జవాబుగా ఉంటుంది. ఓటర్ల మనోగతాలు ఒక్క పట్టాన అర్ధం కావు అనడానికి కూడా వీటినే నిదర్శనంగా చూపుతారు. ఓడిపోతామని అనుకున్న వారిని తెచ్చి అందలం ఎక్కించిన ఫలితాలు అంటే ఇవే అని చెబుతారు. ఓటర్లు అంటే ప్రజాస్వామ్యంలో ప్రభువులు వారి తీర్పు వారు తలచుకుంటే చూపించే కరుణ ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికే అనకాపల్లి ఎంపీ రిజల్ట్ ని ఈ రోజుకీ అంతా తలచుకుంటూ ఉంటారు.