విశాఖ కాస్మోపాలిటన్ సిటీగా చూస్తారు. ఒక విధంగా చెప్పాలంటే మినీ ఇండియా కూడా. ఉత్తర భారతం నుంచి వచ్చిన వారు విశాఖలో నివాసం ఉంటారు. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో విశాఖ సిటీ జనాభా ఈ రోజుకు పాతిక లక్షలకు పై దాటింది.
పండుగలు పబ్బాలు వస్తే సగానికి పైగా విశాఖ ఖాళీ అవుతుంది. ఇప్పుడు కూడా ఓట్ల పండుగ వచ్చింది. దాంతో విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారు అంతా రైల్వే స్టేషన్లు బస్సు స్టేషనల్లో క్యూ కట్టేశారు. అందిన కాడికి బస్సు రైలు లేక ఏ ఇతర వాహనం అయినా అందిపుచ్చుకుని తన సొంత ఊళ్ళకు వెళ్ళిపోవాలని తెగ తాపత్రయపడుతున్నారు.
దాంతో విశాఖలో చాలా చోట్ల నివాసాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉద్యోగం ఉపాధి కోసం విశాఖకు వలస వచ్చిన వారు అంతా ఓట్ల కోసం జిల్లాలోని మారుమూల పల్లెలకు లగెత్తుకుని పోతున్నారు. అలాగే ఇతర జిల్లాలకు కూడా వెళ్తున్నారు. దాంతో పోలింగ్ కి ఒక రోజు ముందే విశాఖ ఖాళీ అవుతోంది.
విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు జనాలు వెళ్ళేందుకు ఆరాటపడడంతో ఆర్టీసీ బస్సులు రైళ్లు ఫుల్ అవుతున్నాయి. ప్రైవేట్ వాహనాలకు ఇదే సమయంగా మారింది. దాంతో భారీ రేట్లు పెంచి మరీ సొమ్ము చేసుకుంటున్న నేపధ్యం ఉంది.
అలా చూసుకుంటే విశాఖలో నివాసం ఉంటున్న వారిలో అత్యధికులు విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. అలాగే ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం విజయనగరం మారు మూల పల్లెలకు వెళ్ళేందుకు సైతం సమాయత్తం అవుతున్నారు.
ఈ పరిణామాలను చూసిన వారు ఓటు హక్కు పట్ల జనాంలో వచ్చిన చైతన్యంగా చూస్తూంటే మరి కొందరు రాజకీయ పార్టీల ప్రలోభాలతో రానూ పోనూ ఖర్చులను సైతం ఇస్తూ వీరిని రప్పించుకుంటున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖ మూడు రోజుల వరకూ బోసిపోయి కనిపిస్తుంది అని అంటున్నారు.