మూడో భార్య అన్నా లెజినోవాకు విడాకుల ప్రచారంపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తెరదించారు. ఇందుకు ఓటింగ్ డే వేదిక కావడం విశేషం. అన్నా లెజినోవాతో పవన్‌కల్యాణ్ కలిసి లేరని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.
మూడో భార్యకు కూడా ఆయన విడాకులు ఇచ్చారని జాతీయ మీడియా సైతం ప్రత్యేక కథనాలు రాసింది. పవన్‌కల్యాణ్ మాత్రం నోరు మెదపలేదు. దీంతో ఆ ప్రచారం నిజమే అనే అభిప్రాయం బలపడింది.
ఇటీవల పిఠాపురంలో గృహ ప్రవేశానికి కూడా అన్నా లెజినోవ్ వెళ్లకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా జనసేన నుంచి బయటికొచ్చిన పోతిన మహేశ్ ప్రత్యేకంగా పవన్ మూడో భార్య గురించి మాత్రమే మాట్లాడ్డం గమనార్హం. పవన్ తన గృహ ప్రవేశానికి భార్యను తీసుకెళ్లాలని ఆయన సూచించారు. కానీ మహేశ్ కోరుకున్నట్టు జరగలేదు. దీంతో అన్నా లెజినోవాతో పవన్ కలిసి లేరంటూ మరోసారి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ ప్రచారానికి ఇవాళ పవన్‌కల్యాణ్ ఫుల్‌స్టాప్ పెట్టారు. పోలింగ్ డేని పురస్కరించుకుని మంగళగిరిలో అన్నా లెజినోవాతో కలిసి ఆయన ఓట్లు వేయడానికి వెళ్లారు. పవన్ దంపతులు విడిపోలేదని చెప్పినట్టైంది. పవన్‌కల్యాణ్ దంపతులను చూసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపడం విశేషం.