2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఎన్నికలు... ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో ఉదయం నుంచి ఓట్లు వేయడానికి రాని వారంతా చివరి గంటలో తమకు కేటాయించిన బూత్‌ల వద్దకు పరుగులు తీస్తున్నారు.
ఆరు గంటల సమయానికి క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు హక్కు కల్పించనున్నారు. అందుకే చివరి నిమిషంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరినట్టు వార్తలొస్తున్నాయి. గత ఎన్నికల్లో కంటే ఈ దఫా ఎంతోకొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయి. ఉదయం నుంచి ఓటింగ్ సరళిని చూస్తే, గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వేయడానికి జనం ఆసక్తి కనబరిచారు.
మరీ ముఖ్యంగా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా క్యూలైన్లలో కనిపించారు. అలాగే వృద్ధులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు ఉత్సాహం చూపడం విశేషం. కుటుంబ సభ్యుల సహకారంతో వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, తమ ఓటు హక్కు వినియోగించుకోవడం చర్చనీయాంశమైంది.
ఓటింగ్ సరళిపై రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా విశ్లేషించుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పోలింగ్ శాతం నమోదు అయ్యిందో మరి కొన్ని గంటల్లో తెలియనుంది. దాన్ని బట్టి కూడా అధికారం ఎవరిదో రాజకీయ విశ్లేషకులు, సర్వే సంస్థలు ఒక అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం వుంది. చివరి గంటలో ఓటర్ల క్యూ...!