కొట్టుకు చచ్చే వాళ్లకు కడప జిల్లాపై సాంస్కృతిక దాడి చేయడం ప్యాషన్‌గా మారింది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తనపై దాడి గురించి మాట్లాడుతూ... ఇదంతా కడప కల్చర్ అని విమర్శలు చేశారు. ఇలాంటి విమర్శలు చేయడం చంద్రబాబు, ఆయన అనుచరులకు వెన్నతో పెట్టిన విద్య. హింస, దాడులు చేసుకోవడం కడప జిల్లా సంస్కృతి అని విమర్శించడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎల్లో బ్యాచ్‌కు కొరకరాని కొయ్య వైఎస్సార్ కుటుంబం. దీంతో నాడు వైఎస్సార్‌ను, ఆ తర్వాత ఆయన కుమారుడైన జగన్‌ను ప్రజల్లో చులకన చేసేందుకు పదేపదే హింసను ప్రేరేపించే నాయకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల అనంతరం చంద్రగిరి నియోజక వర్గంలో హింస ప్రజ్వరిల్లింది. ఇలాంటి చర్యల్ని సమాజం అంగీకరించదు. అయితే హింసాత్మక ఘటనలు ఎక్కడ జరిగినా కడప కల్చర్ అంటూ నోరు పారేసుకోవడం టీడీపీ నేతలకు అలవాటైంది.
వాళ్ల ఆరోపణలే నిజమైతే.... మరి ఎన్నికల్లోనూ, ఆ తర్వాత కడప జిల్లాలో గొడవలు ఎందుకు జరగలేదనే ప్రశ్నకు ఎవరు సమాధానం ఇస్తారు? రాజకీయంగా వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక కడప ప్రజానీకం సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేయడం ఎంత వరకు సమంజసమో వారే ఆలోచించుకోవాలి. ఇంత కాలం కడపపై చేసిన సాంస్కృతిక దాడి ఇక చాలు. కడప ప్రజానీకం గొడవలకు దూరం. ఈ విషయం ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన తీరే రుజువు చేసింది.
రాజకీయ స్వార్థానికి కడప ప్రజల మనోభావాలతో ఆడుకోవడం సరైంది కాదు. కడప కల్చర్ గురించి ఏ మాత్రం తెలియని మూర్ఖులే ఆ ప్రాంతంపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. భవిష్యత్ కాలం గురించి ఎంతో ముందుగానే పసిగట్టి చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మం ఆ ప్రాంతం వాసే. అలాగే అన్నమయ్య లాంటి వాగ్గేయకారుడు కడప నివాసే. ఇలా చెప్పుకుంటూ పోతే కడపలో మహామహులు చాలా మందే ఉన్నారు. కావున రాజకీయంగానే ఎదుర్కోవడం మంచిది. పదేపదే కడపపై విషం చిమ్మితే దాని ఫలితాలు కూడా అనుభవించాల్సి వుంటుంది.