ఎన్డీఏకు యీసారి 400 దాటాలి అనే నినాదంతో బిజెపి ముందుకు వెళుతోంది. జగన్ వై నాట్ 175? అన్నట్లే అది కూడా కార్యకర్తలను ఉత్సాహపరిచే నినాదమే తప్ప నిజంగా 400కు పైన సాధించ గలమని బిజెపియే అనుకోవటం లేదు అనేవాళ్లున్నారు. 2019లో బిజెపికి 303 వచ్చాయి. ఎన్డీఏలోని తక్కినవాటికి 50 వచ్చాయి. మొత్తం 353 అయింది. ఇప్పుడది 400+ కావాలంటే బిజెపికి గతంలో కంటె 30, 40 ఎక్కువ రావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అలా వస్తాయని ఎవరూ గట్టిగా చెప్పలేక పోతున్నారు. ఉత్తరాదిన, పశ్చిమాన గతంలో కంటె తమకు తక్కువ వస్తాయని, ఆ మేరకు దక్షిణాదిన ఎక్కువ సంపాదించాలని బిజెపి అనుకుంటోందని వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ ఎంత తక్కువ వస్తాయి? ఏ మేరకు దక్షిణాదిన పుంజుకుంటుంది? అనేదే ఆసక్తి రేపుతోంది.
ఉత్తరాదిన, పశ్చిమాన తగ్గుతాయి అని ఏ బేసిస్‌న అంటున్నారు? బిహార్, మహారాష్ట్రలలో గతంలో తెచ్చుకున్న సీట్ల కంటె ఎన్డీఏ తక్కువ తెచ్చుకుంటుంది అని ఒక అంచనా. 400 దాటాలంటే మహారాష్ట్రలో బలం యథాతథంగా ఉండాలి. ఉందా? అనేది పరిశీలించడానికే యీ వ్యాసం. దానికి ముందు 400+ గురించి జరుగుతున్న చర్చ గురించి కొంత రాస్తాను. సట్టా బజారు మూడ్ ఎలా ఉందో యివాళ ఒక పత్రిక వేసింది. బిజెపికి 310 సీట్లు వస్తే మనం బెట్ కట్టిన రూపాయికి 55-65 పైసలు యిస్తారట. 320 అయితే 110-160, 325 అయితే 150-225 యిస్తాంటున్నారట. అంటే 320 వస్తాయని కూడా ఆ వ్యాపారులు అనుకోవటం లేదన్నమాట. ఎన్డీఏకు 330 వస్తాయని అంచనాట. యుపిలో 2, బెంగాల్‌లో 4, ఒడిశాలో 4, తమిళనాడులో 4 ఎక్కువగా వస్తాయని, రాజస్థాన్‌లో 5, హరియాణాలో 5, తెలంగాణలో 2 తగ్గుతాయని వాళ్ల లెక్కట.
బిజెపికి ప్రచ్ఛన్న మిత్రుడిగా పేరు తెచ్చుకుంటున్న ప్రశాంత కిశోర్ బిజెపికి గతంలో కంటె పదో, ఇరవయ్యో ఎక్కువ వస్తాయంటున్నాడు. ప్రత్యక్ష శత్రువుగా పేరు బడిన యోగేంద్ర యాదవ్ ‘అబ్బే 250 దాటితే గొప్ప’ అంటున్నాడు. ఇద్దరూ సర్వేలు చేయించలేదు. గట్ ఫీలింగుతో చెప్పామనే అంటున్నారు. ప్రశాంత కిశోర్ 2019 కంటె మోదీపై ఉన్న ఆరాధన సాంద్రత 2024 నాటికి పలుచనైంది కాబట్టి నార్త్, వెస్ట్‌లలో ఓ 20 తగ్గినా కానీ ఆ మేరకు దక్షిణాదిన ఎక్కువ తెచ్చుకుంటుంది అన్నాడు. అది కాస్త ఆశ్చర్యంగా ఉంది. తక్కినవాటి మాట ఎలా ఉన్నా కర్ణాటకలో బిజెపిపై ఆగ్రహం చాలా ఉందనే మాట వినబడుతోంది.
వానలు లేక, కరువు వచ్చిపడడంతో జనం మలమల మాడుతున్నారు, రైతులు హాహాకారాలు చేస్తున్నారు. ఎన్‌డిఆర్ఎఫ్ నియమాల ప్రకారం యివ్వవలసిన 18 వేల కోట్ల కరువు సాయాన్ని కేంద్రం యివ్వకుండా తొక్కిపెట్టింది. కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళితే అది యిమ్మనమంది. అయినా 4 వేల కోట్లకు లోపు నిధులిచ్చారు. గతంలో బియ్యం విడుదలపై కూడా చాలా రగడ జరిగింది. ‘మేం పన్నులు వసూలు చేసి ఎంతో పంపుతున్నాం. కానీ మాకు తిరిగి యిచ్చేది తక్కువ. యుపి లాటి రాష్ట్రాల నుంచి వచ్చే పన్ను ఆదాయం తక్కువ. కానీ వాళ్లకు యిచ్చేది ఎక్కువ. కర్ణాటకపై బిజెపి శీతకన్ను వేసింది.’ అని కాంగ్రెసు ప్రచారం చేస్తోంది. స్థానిక బిజెపి నాయకులు సర్ది చెప్పలేక అవస్థ పడుతున్నారు. రైతుల పార్టీ ఐన జెడిఎస్ బిజెపితో చెలిమి వలన ఏ మేరకు లాభపడిందో ఫలితాలు చెప్తాయి. కర్ణాటకలో సీట్లు తగ్గితే బిజెపి దక్షిణాది ఆశలు భగ్నమైనట్లే.
ఐదు విడతల పోలింగు వరకు పరిశీలిస్తే 20 రాష్ట్రాలు, యుటిలలో ఉన్న 427 లోక సభ స్థానాలలో ఓటింగు శాతం తగ్గింది. గత ఎన్నికలలో 68% ఓటేయగా యీసారి 66.4% ఓటేశారు. ఆరో విడతలో 8 రాష్ట్రాలు, యుటిలలో ఉన్న 58 సీట్లలో జరిగిన ఓటింగు శాతం 60+ అంటున్నారు. రాజకీయ చైతన్యం బాగా ఉన్న బెంగాల్ 78.2% కలిపితేనే యీ అంకె వచ్చింది. బిజెపికి బలమున్న యుపిలో 54% మాత్రమే. 2019లో అయితే ఫుల్వామా ఉంది, యీసారి అలాటిది ఏదీ లేకపోవడంతో మోదీ గ్లామరు తగ్గి ఓటింగు శాతం తగ్గింది, దాంతో బిజెపి కంగారు పడుతోంది అనే కథనాలను వండుతున్నారు.
ఓటింగు శాతాలకు ప్రభుత్వ వ్యతిరేకత లేదా అనుకూలతకు సంబంధం లేదని గతంలోనే ఒక వ్యాసం రాశాను. ఈ ఉదాసీనతకు యితర కారణాలేమిటో ఫలితాల తర్వాత విశ్లేషణలు రావచ్చును. మోదీ ఎలాగూ గెలుస్తాడు కదా, మనం ఓటేయకపోతే నష్టమేమిటి అని ఓటేయడానికి బద్ధకించి ఉండవచ్చు అనేది సహజంగా రావలసిన ఆలోచన. 1996 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్థి బాబ్ డోల్ కంటె డెమోక్రాటిక్ అభ్యర్థి బిల్ క్లింటన్ ఒపీనియన్ పోల్స్‌లో ఎంతో ముందు ఉన్నాడు. దాంతో ఎలాగూ బిల్ గెలుస్తాడు కదాని క్లింటన్ సమర్థకుల్లో 10% మంది, డోల్ సమర్థకుల్లో 9% మంది ఓటింగుకి వెళ్లలేదు. పర్యవసానంగా 49% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 72 సం.లలో యిది అతి తక్కువట!
ఐదు విడతల వరకు జరిగిన పోలింగులో 2019తో పోలిస్తే ఓటింగు తగ్గిన రాష్ట్రాలలో కేరళ (6.5%), రాజస్థాన్ (4.8%), ఉత్తరాఖండ్ (4.4%), మధ్యప్రదేశ్ (4.3%) గుజరాత్ (3.3%), యుపి (2.6%), తమిళనాడు (2.7%), బిహార్ (1.7%), ఝార్ఖండ్ (1.6%) ఉన్నాయి. 427 స్థానాలలో పోలింగు జరిగితే వాటిలో 27%, అంటే 115 స్థానాలలో 2019 కంటె ఓటర్లు తగ్గారు. ప్రతీ ఏడూ జనాభా పెరుగుతుంది. ఓటు హక్కు పొందే వారి సంఖ్య పెరుగుతుంది. అయినా ఎందుకిలా అయింది? పైగా వీటిలో 96 స్థానాల్లో ఎప్పుడూ ఓటర్లు పెరగడమే తప్ప తగ్గడమంటూ జరగలేదు. ఈ స్థానాలను ప్రతిపక్షం 2019లో గెలవడమో, 2024లో గెలుస్తుందని ఆశలు పెట్టుకోవడమో జరిగిందని కొందరు పరిశీలకులు ఎత్తి చూపుతూ, ఒక సందేహాన్ని మెదడులో నాటుతున్నారు.
సరే, యిక మహారాష్ట్రకు వద్దాం. ఇక్కడున్న పార్లమెంటు స్థానాలు 48. ఉత్తర ప్రదేశ్ తర్వాత ఎక్కువ స్థానాలున్నది యిక్కడే. 2019లో బిజెపి 23 స్థానాల్లో, దాని భాగస్వామి శివసేన 18 స్థానాల్లో మొత్తం 41 గెలిచాయి. వాళ్లకు ప్రత్యర్థిగా నిలిచిన ఎన్సీపీ 4 గెలిచింది. తర్వాతి రోజుల్లో బిజెపి శివసేనను రెండుగా చీల్చి ఒక పెద్ద వర్గాన్ని తనతో కలుపుకుంది. ఎన్సీపీనీ అలాగే చేసింది. ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని ఏలుతున్నారు. 41 స్థానాలలో యీసారి ఎన్ని కోల్పోతే ఎన్డీఏ బలం ఆ మేరకు తగ్గినట్లే! కోల్పోతుందా, గతంలో కంటె ఎక్కువ తెచ్చుకుంటుందా అనేది ఊహించాలంటే మహారాష్ట్ర పరిస్థితులు గమనించాలి. గతంలో దేశానికి ఆర్థిక రాజధాని అంటే ముంబయి అనేవారు. దేశంలోని వివిధ ప్రాంతాల వారే కాదు, విదేశీయులు కూడా మహారాష్ట్రలో పెట్టుబడి పెట్టడానికి ఉబలాట పడేవారు. ఇప్పుడది గతవైభవం అయిపోయింది. 9వ స్థానానికి పడిపోయింది. ప్రజల తలసరి ఆదాయం విషయంలో దానిది 8వ స్థానం.
మహారాష్ట్ర గోల్డెన్ ట్రయాంగిల్‌గా చెప్పుకునే ముంబయి, పూనా, నాశిక్‌లను తప్పిస్తే తక్కిన రాష్ట్రం బిహార్, ఒడిశాల లాటిదే అంటారు ‘‘లోకసత్తా’’ సంపాదకుడు గిరీశ్ కుబేర్. దానివలన నిరుద్యోగం ప్రబలి యువతలో అశాంతి పెరిగింది. అది చాలనట్లు రాష్ట్రంలో శిందే ముఖ్యమంత్రిగా ఎన్డీఏ పాలన వచ్చాక మహారాష్ట్రకు రావలసిన అనేక ప్రాజెక్టులను కేంద్ర బిజెపి మోదీ, అమిత్‌ల స్వరాష్ట్రమైన గుజరాత్‌కు తరలించేస్తున్నారనే ప్రచారం రావడంతో ప్రజలు బిజెపిపై, వారి కీలుబొమ్మ ఐన శిందేపై భగ్గుమంటున్నారని ఆయన అన్నాడు. శిందే నడిగితే అదేమీ లేదు, మాకు బోల్డు పరిశ్రమలు వస్తున్నాయి అంటున్నాడు. దిల్లీ పెత్తనమనేది శివాజీ కాలం నుంచి మహారాష్ట్రులలో ఆవేశాన్ని రగిలించే అంశమని కుబేర్ అంటారు. ఇప్పుడు బిజెపి మహారాష్ట్రకు ద్రోహం చేసి, దాని పరిశ్రమలను కొల్లగొడుతోంది అనే ప్రచారం భావోద్వేగాలను రెచ్చగొడుతోంది అన్నారాయన.
అదొక్కటే కాదు, మహారాష్ట్రలో తొలి నుంచీ కొన్ని రాజకీయ కుటుంబాలే ఏలుతున్నాయి. ప్రజలు వాటికి అలవాటు పడ్డారు. ఇప్పుడు బిజెపి వచ్చి వాటిని చీల్చడం వారికి ఆగ్రహాన్ని కలిగిస్తోంది. శిందే ఠాక్రే కుటుంబ సభ్యుడు లాటివాడు. శివసేనను చీల్చి శిందేను ఉద్ధవ్ నుంచి వేరు చేసినది బిజెపియే. మరో పక్క అజిత్ పవార్‌కు కేసుల భయం చూపించి, బాబాయి శరద్ నుంచి (ఇంగ్లీషులో నెఫ్యూ అని చూసి తెలుగులో కొందరు మేనల్లుడు అని రాస్తున్నారు. మేనల్లుడి యింటి పేరు వేరే ఉంటుంది కదా!) విడగొట్టింది బిజెపియే. తమ పార్టీలోకి వచ్చాక అజిత్‌పై, అతని భార్యపై కేసులు నీరు కార్చేశారు. శరద్ ఏకైక సంతానం సుప్రియా సూలే. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తన భార్య సునేత్రను నిలబెట్టమని అజిత్‌పై బిజెపి ఒత్తిడి తెచ్చిందని, ఇష్టం లేకపోయినా అజిత్ కాదనలేక పోయాడని టాక్.
కొడుకులు లేని శరద్ అజిత్‌ను తన సొంత కొడుకు కంటె ఎక్కువగా చూసుకుని, తను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లగానే తన కంచుకోట బారామతి ప్రాంతం మొత్తాన్ని గత పాతికేళ్లగా అతనికి అప్పగించేశాడు. శరద్‌కు తన ప్రజలతో టచ్ పోయింది కూడా. సర్వస్వమూ అజితే! అజిత్ అక్కడ ఎన్నో పరిశ్రమలు తెచ్చి, ప్రాంతాన్ని వృద్ధిపరచి, ఎంతో పేరూ, డబ్బూ గడించాడు. అలాటి శరద్‌ను బాబాయి నుంచి వేరు చేసి, తమకు బానిసను చేసుకుంది కేంద్ర బిజెపి అనే భావం మహారాష్ట్ర జనాల్లో ఉంది. ఇప్పుడు మోదీ శరద్‌ను ‘భటక్‌తీ ఆత్మా’ (అసంతృప్తితో, అశాంతితో తిరుగాడే ఆత్మ) అని ఎద్దేవా చేశాడు. రాజకీయంగా ఎంత టక్కరి, మోసగాడు ఐనా శరద్ యిప్పటి మహారాష్ట్ర నాయకుల్లో ఒక స్టేచర్ ఉన్నవాడనే భావం పార్టీలకు అతీతంగా మహారాష్ట్రులందరిలో ఉంది. కేంద్రం చేతిలో ఉన్న సంస్థల ద్వారా శరద్ పార్టీని, అతని ఎన్నికల చిహ్నాన్ని లాక్కున్ని, 84 ఏళ్ల వయసులో అతన్ని చెమటోడ్చేట్లా చేస్తూ అతన్ని యిలా అనడం వారిని నొప్పించింది.
ఉద్ధవ్ మీద, శరద్ మీద సింపతీ పెరిగి, కుటుంబాలను చీలుస్తున్నాడని తన మీద పడిన ముద్రను తుడుచుకోవాలనుకుని మోదీ యీ మధ్య ‘ఉద్ధవ్ తండ్రి బాల్ ఠాక్రే అంటే నాకెంతో గౌరవం. ఉద్ధవ్ కేదైనా సమస్య వస్తే నా దగ్గరకు వస్తే తప్పక సాయం చేస్తాను.’ అని ప్రకటించాడు. ఉద్ధవ్‌కి సమస్య తెచ్చిపెట్టినదే మోదీ అని గుర్తున్నవారికి యిది నవ్వు తెప్పిస్తుంది. బారామతి విషయానికి వస్తే శరద్ కుటుంబం ఎలా చీలిందో అర్థమౌతుంది. అజిత్, అతని భార్య బిజెపిలో చేరారు. అజిత్ సొంత అన్నగారు శ్రీనివాస్, అతని కుటుంబం, శరద్ మరో అన్నగారి కొడుకు రాజేంద్ర, అతని కొడుకు, ఎమ్మెల్యే అయిన రోహిత్ – వీళ్లందరూ శరద్‌తోనే ఉన్నారు. అయినా మధ్యవయస్కులందరూ అజిత్ పక్షాన ఉన్నారు. అతనైతే పరిశ్రమలు తేగలడని, తమకు ఉద్యోగాలు వస్తాయనీ వాళ్ల ఆశ.
దేశం మొత్తంలో ఉన్నట్లే అధికధరలు, నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది మహారాష్ట్రలో. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల గురించి అందరికీ ఫిర్యాదులే. ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాలలో కేంద్రాన్ని తప్పు పట్టవచ్చు. కానీ యిక్కడ ఉన్నది డబుల్ ఇంజన్ సర్కార్. ఈ నిరుద్యోగం అనేదాన్ని ప్రధాన సమస్యగా తీసుకుని జనాభాలో మూడో వంతు ఉన్న మరాఠాలు చాలాకాలంగా ఆందోళన చేస్తున్నారు. వారిలో చాలామంది రైతులు, రైతు కూలీలు. ‘వ్యవసాయం నష్టదాయకంగా ఉంది. ఉద్యోగాలు రావటం లేదు. మమ్మల్ని బిసిలుగా గుర్తించి విద్యలో, ఉద్యోగాలలో మాకు రిజర్వేషన్ యివ్వండి.’ అని మరాఠాల డిమాండు. శిందే వారిలో కున్బీలనే వర్గాన్ని బిసిలుగా గుర్తించాడు.
‘మరాఠాలంటే ఎప్పణ్నుంచో పాలిస్తూ వచ్చినవారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలవంతులు. అలాటివారు బిసిలుగా చెప్పుకుని, మా రిజర్వేషన్లలో వాటాకు రావడమేమిటి? కుదరదు. కావాలంటే విడిగా తెచ్చుకోమనండి.’ అని మంత్రిగా ఉన్న ఛగన్ భుజ్‌బల్‌తో సహా బిసి నాయకులందరూ వ్యతిరేకిస్తున్నారు. మరాఠాలలో డబ్బున్నవారూ, లేనివారూ అందరూ ఉన్నారు. కున్బీలు కాని మరాఠాలకు 10% రిజర్వేషన్ 2024 ఫిబ్రవరిలో వర్తింప చేశానని శిందే అంటాడు. అవి అమలు కాలేదని మరాఠాలు అంటారు. తక్కిన మరాఠాలను కూడా కున్బీలుగా గుర్తించమని వారి డిమాండు. వ్యవహారం కోర్టులో ఉంది, నన్నేం చేయమంటారు? అంటాడు శిందే. మరాఠా నాయకుడు మనోజ్ జారంగీ పాటిల్ యిది బిజెపి, శిందేలు చేసిన నమ్మకద్రోహం అంటాడు.
ధనిక మరాఠాలు చాలాకాలంగా సుగర్ మిల్లులలో, కోఆపరేటివ్ బ్యాంకుల్లో, ఆగ్రి యిండస్ట్రీస్‌లో, స్థానిక సంస్థల్లో పాతుకుపోయి ఉన్నారు. వాటి బలంతో రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. శరద్ పవార్ ఎదిగినది అలాగే! రాష్ట్రంలో బిజెపి బలపడడం ప్రారంభించాక యీ సంస్థలన్నిటిలో మరాఠాలను తప్పిస్తూ వారి బలాన్ని క్షీణింప చేసింది. అదొకటి మరాఠాలకు మంటగా ఉంది. మరాఠాలతో సహా వ్యవసాయదారులందరూ కేంద్ర ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు. పత్తి ధరలు సగానికి సగం పడిపోయాయి. ఉల్లి రైతుల కష్టాలు చెప్పనలవి కాదు. ఎన్నికల వేళ ఉల్లి ధరలను తగ్గించకపోతే పట్టణవాసుల ఓట్లు పడవనే భయంతో కేంద్రం ఉల్లి ఎగుమతులను నిషేధించి, మార్కెట్లో ఉల్లి లభ్యమయ్యేట్లు చేసింది. దాంతో రేటు పడిపోయి, రైతులకు కిట్టుబాటు ధర రావటం లేదు.
వాళ్లు గోల పెడితే కేంద్రం గుజరాత్ నుంచి ఎగుమతి అయ్యే తెల్ల ఉల్లి ఎగుమతిని మాత్రం అనుమతించి, మహారాష్ట్రంలో పండే ఎర్ర ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కొనసాగించింది. అసలే కేంద్ర గుజరాత్ పక్షపాతంపై మండిపడుతున్న మరాఠీ రైతులను యిది మరింత మండించింది. స్థానిక బిజెపి ప్రభుత్వానికి యిది యిబ్బందికరం అయింది. 2024 ఏప్రిల్‌లో 99 వేల టన్నుల ఎర్ర ఉల్లిని ఆరు దేశాలకు ఎగుమతి చేయవచ్చు అంటూ కేంద్రం అనుమతించింది. అయితే ఎగుమతి పన్ను, జిఎస్టీ అంటూ చచ్చేటంత భారం వేయడంతో అవి పాకిస్తాన్ ఉల్లి కంటె ఒకటిన్నర రెట్లు ఖరీదయ్యాయి. దాంతో ఆ 6 దేశాల వారూ మనవి కొనటం లేదు, పాకిస్తాన్‌వే కొంటున్నారు. హతాశులైన రైతులందరూ బిజెపికి బుద్ధి చెప్తామంటున్నారు.
పార్లమెంటు ఎన్నికలలో ఇండియా కూటమి తరఫున ఉద్ధవ్ సేన 21, కాంగ్రెసు 17, శరద్ ఎన్సీపీ 10 పోటీ చేస్తూండగా ఎన్డీఏ కూటమి తరఫున బిజెపి 29, శిందే శివసేన 15, అజిత్ ఎన్సీపీ 5 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలోని శిందే, అజిత్‌లకు ఆర్నెల్లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఎక్కువ స్థానాలు అడుగుతుందేమోననే భయం ఉంది. అందువలన యిప్పుడే కొన్ని లోకసభ స్థానాల్లో బిజెపికి ఎసరు పెడదామని చూస్తున్నారట. కాంగ్రెసు లోని పెద్ద నాయకులను బిజెపి తనలోకి లాక్కుంది. వీళ్లంతా మహా అవినీతిపరులని బిజెపి గతంలో ఆరోపించిన వాళ్లే. అజిత్, శిందేల సంగతి సరేసరి. అందువలన అవినీతిని బిజెపి ఎన్నికల అంశంగా చేయలేక పోయింది.
విదర్భ ప్రాంతం, నాగపూర్ ఆరెస్సెస్ రోజుల్నించీ బిజెపికి కంచుకోట. 10 సీట్లలో 2019లో ఒక్క సీటు తప్ప తక్కినవన్నీ బిజెపి, శివసేన గెలిచాయి. కానీ యీసారి గడ్డుగానే ఉందంటున్నారు. ప్రకాశ్ ఆంబేడ్కర్ విబిఏ పార్టీ (వంచిత్ బహుజన్ అఘాడీ) ఇండియా కూటమిలో చేరకపోయినా బిజెపి వ్యతిరేక ఓట్లు చీల్చనంటూ ఏడు స్థానాలలో తన అభ్యర్థులను నిలపలేదు. శిందే కున్బీ మరాఠాలను బిసిలుగా గుర్తించడంపై యిక్కడి బిసిలు కోపంగా ఉన్నారట. బిజెపి పొత్తులోంచి బయటకు వచ్చాక, శిందే వెన్నుపోటు తర్వాత ఉద్ధవ్ యింతకాలం నిలదొక్కుకుంటాడని ఎవరూ అనుకోలేదు. ఇప్పుడు తన హిందూత్వను కాస్త తగ్గించాడు. ఉపన్యాసం ప్రారంభిస్తూ ‘దేశభక్తులైన సోదరసోదరీ మణులారా’ అంటున్నాడు. గతంలో ఐతే ‘నా హిందూ సోదరసోదరీ మణులారా’ అనేవాడు. సేనకు బలంగా ఉన్న కొంకణ్ ప్రాంతంలో ఉద్ధవ్ ఉధృతి అలాగే ఉందంటున్నారు. ఫిరాయింపులతో తమ ప్రభుత్వాన్ని కూలదోసి, కేంద్ర బిజెపి పెత్తనం చలాయిస్తోందని, మహారాష్ట్రను దోచి గుజరాత్‌కు పెడుతోందని చెప్పి ఉద్ధవ్, కాంగ్రెసు, శరద్ సింపతీ పొందడంతో పాటు మరాఠీ అస్మిత (ఆత్మగౌరవం)ను ఎన్నికల అంశంగా చేస్తున్నారు.
మహారాష్ట్రలో హిందూత్వవాదం ఎప్పణ్నుంచో బలంగా ఉంది. పైగా బాబ్రీ మస్‌జీద్ కూల్చివేతలో శివసైనికుల పాత్ర కూడా ఉందని బాల్ ఠాక్రే గర్వంగా చెప్పుకునేవారు. అయోధ్య రామాలయం కట్టినందు వలన బిజెపికి రాజకీయ లాభం ఒనగూడి, యీ అస్మితను ఎదుర్కుంటుందని కొందరి అంచనా. మహారాష్ట్రలో రాముడి పట్ల భక్తి ఉన్నమాట నిజమే కానీ, విష్ణువు మరో అవతారమైన పాండురంగ విఠలుడి పట్ల ఉన్నంత ఆరాధన లేదని పరిశీలకులంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా బిజెపి అయోధ్య మందిరం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఉత్తరాది రాష్ట్రాలలో అయితే కాంగ్రెసు అధికారంలోకి వస్తే అయోధ్యాలయాన్ని బుల్‌డోజర్లతో కూల్చేస్తుందని మోదీ భయపెట్టారు. ఇక్కడ అలాటి ప్రయత్నం జరగలేదు. తెలంగాణ బిజెపి అభ్యర్థులు ముగ్గురు నలుగురు తమ నియోజకవర్గాల్లో అయోధ్య అక్షింతలు పంచిపెట్టి ఆ సెంటిమెంటును ఎన్‌క్యాష్ చేసుకోబోయారట కానీ ఆంధ్రలో అయోధ్య ఒక అంశంగానే లేదు.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూస్తే మహారాష్ట్రలో గతంలో 41 సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ యీసారి 30కి మించి తెచ్చుకోదని పరిశీలకులు అంటున్నారు. గిరీశ్ కుబేర్ అయితే 30కి లోపు, 25కి పైన వస్తాయన్నారు. గుజరాత్‌లో 26 స్థానాలూ మళ్లీ గెలిచేసినా, కొత్తగా వచ్చేవి ఏమీ లేవు. వెస్ట్ సంగతి యిది. ఇక నార్త్ విషయానికి వస్తే యుపి 80 సీట్లలో 2014లో 71 గెలిచిన ఎన్డీఏ 2019 నాటికే 62కి తగ్గింది. ఇక 40 సీట్ల బిహార్ విషయానికి వస్తే 2014లో 22 వస్తే 2019 నాటికి అది 17కి పడింది. ‘రెండు రాష్ట్రాలలో అదే కనిష్టం, అంతకు మించి పెరగాలి తప్ప తగ్గడానికి ఛాన్సు లేదు’ అంటాడు ప్రశాంత్ కిశోర్. యుపి మాట ఎలా ఉన్నా, బిహార్‌లో తగ్గవచ్చేమో అని కొందరి సందేహం. జూన్ 4న ఫలితాలు వచ్చే లోగా వీలైతే బిహార్‌ను పరామర్శిద్దాం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2024)