వైసీపీకి బిగ్ రిలీఫ్‌!

పార్టీ కార్యాల‌యాల కూల్చివేత‌ల‌పై వైసీపీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. కార్యాల‌యాల కూల్చివేత‌ల‌పై స్టేట‌స్‌కో (య‌ధాత‌ధ‌) కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ప్ర‌జ‌ల‌కు ప్ర‌మాద‌క‌రంగా వుంటేనే కూల్చివేయాల‌ని, లేదంటే కుద‌ర‌ద‌ని న్యాయ స్థానం తేల్చి చెప్పింది.

వైసీపీ కార్యాల‌యాలను ఎప్పుడెప్పుడు కూలుస్తామా? అని త‌హ‌త‌హ‌లాడుతున్న చంద్ర‌బాబు స‌ర్కార్‌కు హైకోర్టులో గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్టైంది. ఇప్ప‌టికే తాడేప‌ల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని అనుమ‌తులు లేవ‌నే కార‌ణంతో చంద్ర‌బాబు స‌ర్కార్ కూల్చి వేసిన సంగ‌తి తెలిసిందే.

ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాల‌యాలపై వివ‌రాల‌ను ప్ర‌భుత్వం రాత్రికే రాత్రే తెప్పించుకుంది. వాటికి నోటీసులు కూడా అంద‌జేసింది. దీంతో వైసీపీ హైకోర్టును ఆశ్ర‌యించింది. ప‌లు ద‌ఫాలు విచార‌ణ అనంత‌రం ఇవాళ తీర్పు వెలువ‌రించింది.

వైసీపీ కార్యాలయాల కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కార్యాల‌యాల అనుమతులకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఇచ్చేందుకు రెండు నెలల గడువు వైసీపీకి ఇవ్వాలని న్యాయ స్థానం సూచించింది. అంతేకాదు, ఆ కార్యాల‌యాలు ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగిస్తే, త‌ప్ప కూల్చ‌డానికి వీల్లేద‌ని హైకోర్టు ఆదేశాలిచ్చింది.  వైసీపీ కార్యాల‌యాల కూల్చివేత‌ల‌పై చ‌ట్ట నిబంధ‌న‌లు అనుస‌రించాల‌ని హైకోర్టు పేర్కొంది. అద‌న‌పు ఆధారాలుంటే రెండువారాల్లో స‌మ‌ర్పించాల‌ని పేర్కొంది. Readmore!

Show comments