వినుకొండలో అందరూ చూస్తుండగానే వైసీపీ కార్యకర్త అబ్దుల్ రషీద్ దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. నిందితుడితో తమకు సంబంధం లేదని టీడీపీ చెబుతున్నప్పటికీ, ఆ పార్టీ నాయకులతో ఫొటోలు బయటికి రావడంతో తప్పించుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా హత్యకు గురైంది వైసీపీ కార్యకర్త కావడంతో, ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీనే చేయించి వుంటుందని ప్రతి ఒక్కరూ నమ్మే పరిస్థితి.
హత్య చేయడం వేరు, అత్యంత దారుణంగా, అది కూడా అందరూ చూస్తుండగా ఇష్టానుసారం నరకడం జనాన్ని భయకంపితుల్ని చేస్తోంది. ఈ దుర్ఘటన ముఖ్యంగా టీడీపీకి రాజకీయంగా దారుణ నష్టాన్ని కలిగించింది. ఎందుకంటే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సీఎం కాబట్టి. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి, ప్రజలు మెచ్చేలా పాలన సాగించాల్సి వుంది.
ప్రస్తుతం ఏపీలో పాలనపై ఎలాంటి చర్చ జరుగుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కూటమి హామీల అమలు కంటే, ఇతరేతర అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, హత్యలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య పరాకాష్ట.
వినుకొండలో వైసీపీ కార్యకర్తకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో హత్య దృశ్యాల్ని చూస్తే, మనసున్న ప్రతి ఒక్కరూ... ఇంత దారుణమా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ హత్య కాదని పోలీసులు చెబుతున్నప్పటికీ, ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అధికార పార్టీ పెద్దల ఆదేశాల మేరకే పోలీసులు ప్రకటనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
వినుకొండ హత్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు పాలనకు మచ్చ తెచ్చింది. ఎందుకిలా జరుగుతోందనే మాట సర్వత్రా వినిపిస్తోంది. కూటమికి రాజకీయంగా నష్టం తెచ్చే చర్యలకి ఇప్పటికైనా ఫుల్‌స్టాప్ పడితే మంచిది.