ఏపీలో ఎన్నికలు.. హీరోల్లో ఎవరు ఎటువైపు?

మెగా ఫ్యామిలీ మద్దతు జనసేనకే. ఇది క్లియర్
మరి అక్కినేని ఫ్యామిలీ ఎటువైపు?
ఘట్టమనేని కుటుంబం ఏ తీరానికి చేరుతుంది.
నందమూరి హీరోల్లో చీలిక రాకుండా ఉంటుందా?

ఎన్నికల సందడి మొదలైందంటే అది రాజకీయాల్లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా చిన్నపాటి ప్రకంపన సృష్టిస్తుంది. హీరోలంతా 2 గ్రూపులుగా విడిపోతారు. కొందరు తటస్థంగా వ్యవహరిస్తే, మరికొందరు మాత్రం పూర్తిస్థాయి ప్రచారంలో దిగుతారు. మరి ఈసారి ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు.

అవిభక్త ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైన సందర్భంగా వచ్చిన ఎన్నికలు కాబట్టి గత ఎన్నికల్లో స్టార్స్ పెద్దగా పాల్గొనలేదు. రాష్ట్ర రాజకీయాలు ఎలా మారుతాయి, పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయంపై ఓ అంచనాకు రాలేక ఏ పార్టీకి కొమ్ముకాయకుండా స్తబ్దుగా ఉండిపోయారు. అయితే ఈ ఐదేళ్లలో హీరోలకు కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. దీంతో ఎవరు ఎటువైపు అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఎన్నికలు వస్తే మెగా కాంపౌండ్ వైపు ప్రశ్నార్థకంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు చిరు తమ్ముడు పవన్ జనసేన పార్టీ పెట్టారు. కాబట్టి ఎప్పుడు ఏ పార్టీ లైమ్ లైట్లో ఉంటే మెగా హీరోలంతా ఆ పార్టీవైపే ఉంటారనేది సుస్ఫష్టం.

ఈసారి మెగాకాంపౌండ్ కు చెందిన 11 మంది హీరోలు పవన్ స్థాపించిన జనసేన వైపే ఉన్నారు. వీళ్లలో నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ క్లియర్ గా తన అభిప్రాయాల్ని చెబుతున్నారు. పవన్ ఎప్పుడు కోరితే అప్పుడు ప్రచారానికి రావడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ హీరోల్లో బన్నీ మాత్రమే కాస్త తేడాగా కనిపిస్తున్నాడు. అంతా ముందుకొచ్చినా బన్నీ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.

ఇక నందమూరి కుటుంబం విషయానికొస్తే, ఈ కుటుంబంలో చీలక ఉందనే విషయం ఓపెన్ సీక్రెట్. తామంతా ఒకటే అని వీళ్లు పైకి ఎన్నిసార్లు చెబుతున్నా.. లోలోపల మాత్రం సమీకరణాలు, రాజకీయాలు మారిపోతుంటాయి. మొన్నటికిమొన్న తెలంగాణ ఎన్నికల సందర్భంగా సొంత అక్కకే ప్రచారం చేయకుండా దూరంగా ఉన్నాడు ఎన్టీఆర్. అలాంటిది ఏపీ ఏన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేస్తాడంటే ఎవరూ నమ్మరు. అదే నిజం కూడా.

ఎప్పట్లానే ఈసారి కూడా ఎన్నికలకు ఎన్టీఆర్ దూరం. ఈ కుటుంబం నుంచి నారారోహిత్ తప్పనిసరిగా ప్రచారంలోకి దిగుతాడు. ఎందుకో అందరికీ తెలిసిన విషయం. ఇక బాబాయ్ బాలయ్య కోసం కల్యాణ్ రామ్, తారకరత్న లాంటి హీరోలు ప్రచారం చేస్తారు. అయితే నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ లేని ఎన్నికల ప్రచారాన్ని ఊహించుకోవడం కాస్త కష్టమే. మిగతావాళ్లెవరూ (బాలయ్యతో సహా) జనాలకు పెద్దగా ఆనరు.

ఈసారి అక్కినేని కాంపౌండ్ పై మాత్రం అందరి దృష్టిపడింది. గత ఎన్నికల్లోనే జగన్ తరఫున నాగార్జున రంగంలోకి దూకుతాడని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఈసారి మాత్రం నాగార్జున ఏపీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. మొదట్నుంచి వైఎస్ కుటుంబానికి, అక్కినేని ఫ్యామిలీకి మధ్య సత్సంబంధాలున్నాయి. ఏఎన్నార్ తర్వాత నాగార్జున, వైఎస్ఆర్ తర్వాత జగన్ ఆ రిలేషన్ షిప్ ను అలానే కొనసాగిస్తున్నారు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు రాష్ట్ర విభజన గందరగోళం మధ్య అందర్లానే నాగార్జున కూడా స్తబ్దుగా మారిపోయాడు. అయితే ఈసారి మాత్రం జగన్ కోసం నాగ్ రాజకీయ రణరంగంలోకి దిగుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక జగన్ కోరితే మరో హీరో సుమంత్ ఎప్పుడూ రెడీ. ఎందుకంటే వీళ్లిద్దరూ క్లాస్ మేట్స్ కదా. వీళ్లతో పాటు నాగ్ చెబితే నాగచైతన్య, సుశాంత్, సుమంత్, అఖిల్.. ఇలా కాంపౌండ్ మొత్తం జగన్ కోసం కదిలొస్తుంది.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ కూడా వైసీపీకి మద్దతుగానే ఉంది. వైఎస్ఆర్, కృష్ణ మధ్య మంచి స్నేహబంధం ఉండేది. కాకపోతే మద్దతు విషయాన్ని వీళ్లు బయటకు చెప్పరు. ఎందుకంటే కృష్ణ కుటుంబానికి చెందిన గల్లా జయదేవ్ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు కాబట్టి. ఎప్పట్లానే ఈసారి కూడా మహేష్, తన బావ గల్లాకే మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి.

గత ఎన్నికల్లో బావకు మద్దతుగా ట్వీట్లుకే పరిమితమైన మహేష్, ఈసారి కూడా అలానే ట్వీట్లు పెట్టి ఊరుకుంటాడా లేక నేరుగా బరిలోకి దిగుతాడా అనేది చూడాలి. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. మహేష్ మద్దతిచ్చేది కేవలం తన బావకు మాత్రమే. టీడీపీకి కాదు. ఆయన ఏ పార్టీలో ఉన్నారనేది మహేష్ కు అనవసరం.

ఇక మిగతా హీరోల విషయానికొస్తే ఎప్పట్లానే రానా, వెంకీ రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నారు. మిగతా హీరోల్లో నిఖిల్ వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నాడు. అటు పోసాని కృష్ణమురళి, థర్టీ ఇయర్స్ పృధ్వి లాంటి నటులు ఆల్రెడీ వైసీపీ కోసం పనిచేస్తున్నారు. వీళ్లతో పాటు భానుచందర్, ఫిష్ వెంకట్, కృష్ణుడు, ఛోటా కె నాయుడు లాంటి వారంతా జగన్ కే మద్దతిస్తున్నారు. ఇక సినీనటి రోజా ఆల్రెడీ వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతు తీసుకొని ఎన్నికల్లో నెట్టుకొచ్చారు చంద్రబాబు. అయితే ఈసారి పవన్ తో పాటు టోటల్ ఇండస్ట్రీ మొత్తం బాబుకు దూరంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా సినీలోకానికి తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ అండగా నిలవడంతో హీరోలు, సినీపెద్దలకు చంద్రబాబుతో పనిలేకుండా పోయింది. దీంతో ఏపీ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై సినీతారలంతా ఇప్పుడు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది.

తలసానిని కలిస్తే సస్పెండా? మరి పరిటాల పెళ్ళిలో సెల్ఫీలు దిగారే

ఇండియన్ యూత్.. సెక్స్ కన్నా స్మార్ట్ ఫోనే ఇష్టం!

Show comments