ప‌వ‌న్ బ‌హు భార్య‌త్వాన్ని జ‌గ‌న్ వ‌దిలి పెట్ట‌రా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హు భార్య‌త్వం గురించి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌దేప‌దే మాట్లాడుతున్నారు. ప‌వ‌న్ పెళ్లాల గురించి మ‌న‌కెందుక‌బ్బా? అని వైసీపీ నాయ‌కులు కూడా ఆఫ్ ది రికార్డుగా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో ప‌వ‌న్ భార్య‌ల గురించి జ‌గ‌న్ మాట్లాడిన‌ప్పుడు, అప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఏదో అన్నారులే అని వైసీపీ నేత‌లు కూడా స‌రిపెట్టుకున్నారు.

కానీ ప‌దేప‌దే ప‌వ‌న్‌క‌ల్యాణ్ భార్య‌ల గురించి మాట్లాడ్డంపై జ‌గ‌న్‌ను త‌ప్పు ప‌ట్టే వాళ్లే ఎక్కువ‌. మ‌రీ ఆయ‌న వీరాభిమానులు మిన‌హాయిస్తే, ఏ ఒక్క‌రూ ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి బ‌హిరంగ స‌భ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌స్తావించ‌డం న‌చ్చ‌డం లేదు. తాజాగా భీమ‌వ‌రంలో మ‌రోసారి ప‌వ‌న్‌పై జ‌గ‌న్ రెచ్చిపోయారు. ఈ ద‌ఫా ప‌వ‌న్ వైవాహిక జీవితాన్ని, ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాల మార్పున‌కు ముడిపెట్ట‌డం విశేషం. జ‌గ‌న్ ఏమ‌న్నారంటే...

"నాలుగైదేళ్ల‌కు ఒక‌సారి కార్ల‌ను మార్చేసిన‌ట్టు భార్య‌ల్ని వ‌దిలేసి, ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా అల‌వోక‌గా వ‌దిలేస్తున్నావ్‌. ఏం మ‌నిష‌వ‌య్యా నువ్వు? అని ఆయ‌న్ని అడిగా. అందుకే ద‌త్త‌పుత్రుడిలో ఈ మ‌ధ్య బీపీ బాగా పెరిగింది. ఇలా నాలుగేళ్ల‌కు, ఐదేళ్ల‌కు ఒక‌సారి భార్య‌ల్ని మార్చ‌డం మొద‌లు పెడితే అక్క‌చెల్లెమ్మ‌ల బ‌తుకులు ఏం కావాలి? అని క‌నీసం ఆలోచ‌న కూడా చేయ‌డు" అని ప‌వ‌న్‌కు జ‌గ‌న్ చుర‌క‌లు అంటించారు.

ఇలా వ్య‌క్తిగ‌త జీవితాల‌ను అగ్ర నాయ‌కులే ర‌చ్చ‌కీడ్చుకుంటే, స‌మాజంలో రాజ‌కీయ నాయ‌కులంటే ఏం గౌర‌వం వుంటుంది? ఇంత చిన్న విష‌యాన్ని జ‌గ‌న్ ఎందుకు ఆలోచించ‌రో అర్థం కాదు. ప‌వ‌న్‌ను తీవ్రంగా టార్గెట్ చేయాలంటే, ఆయ‌న బ‌హుభార్య‌త్వానికి మించిన అంశం లేద‌ని జ‌గ‌న్ న‌మ్ముతున్న‌ట్టున్నారు. కానీ రాజ‌కీయాల్లో ఇలాంటివి గౌర‌వం ఇవ్వ‌వ‌ని జ‌గ‌న్ గ్ర‌హించాలి. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేయాలంటే ఎన్ని లేవు? కేవ‌లం 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంట్ స్థానాల‌కే అంగీక‌రించ‌డంపై జ‌న‌సేన శ్రేణులే ర‌గిలిపోతున్నాయి.

ప‌వ‌న్‌పై ఆగ్ర‌హంగా ఉన్న జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్ని త‌న వైపు తిప్పుకోడానికి ఇవ‌న్నీ జ‌గ‌న్‌కు దోహ‌ద‌ప‌డుతాయి. అలాగే తీసుకున్న ఆ త‌క్కువ సీట్ల‌లో కూడా స‌గం స్థానాల్లో టీడీపీ, వైసీపీ నుంచి చేరిన వారికే ద‌క్కాయి. ఇలా ప‌వ‌న్‌ను టార్గెట్ చేయాలంటే ఎన్ని లేవు? ప‌దేప‌దే ప‌వ‌న్ భార్య‌ల గురించి విమ‌ర్శిస్తే, వాళ్లు కూడా అదే స్థాయిలో వ్య‌క్తిగ‌త అంశాల్ని ట‌చ్ చేస్తే... ఏమైనా మ‌ర్యాద వుంటుందా? ఇప్ప‌టికైనా రాజ‌కీయాల్లో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.