కుట్ర చేసింది చాలక.. మొసలి కన్నీరు కూడానా?

చంద్రబాబు నాయుడుకు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కు ఇప్పుడు హఠాత్తుగా పెన్షనర్ల మీద ప్రేమ పొంగిపోతోంది. వారికి ఇళ్లవద్దనే పింఛను అందజేయాలంటూ వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. సజావుగా సాగిపోతున్న వ్యవస్థలో పుండు పెట్టింది వారే. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛను ఇవ్వకుండా నిషేధాజ్ఞలు పుట్టించింది వాళ్లే. వాలంటీర్ల మీద పగబట్టినట్టుగా రకరకాల దుష్ప్రచారాలు సాగించి, వారి మీద అనుమాన బీజాలు నాటింది వాళ్లే. తీరా ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ సమయంలో పదుల సంఖ్యలో వృద్ధుల ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు ఇప్పుడు భయం పుడుతున్నట్టుగా ఉంది.

మే నెల వచ్చేస్తోంది. ఈసారి పింఛన్ల పంపిణీలో ఏ ఒక్కరు చిన్న ఇబ్బంది పడినా సరే.. తమ బతుకులకు ఎండ్ కార్డు పడిపోతుందనే భయం వారిలో ఉంది. అందుకే మొసలి కన్నీరు కారుస్తున్నారు.

ఈ సారి మే నెల ఒకటో తేదీనే పింఛన్లను ఖచ్చితంగా ఇళ్ల వద్దకే అందించేలా సిబ్బంది ద్వారా గట్టి ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. ఆయన తరఫున మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆ లేఖను ఎన్నికల సంఘానికి అందజేశారు.

చంద్రబాబు లేఖాస్త్రంతో ఒక డ్రామా నడిపిస్తోంటే.. మరోవైపు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ మరో ప్రహసనం నడిపిస్తున్నారు. ఒకటో తేదీ నాటికి ప్రతి ఇంటికీ పింఛను చేరకపోతే గనుక.. ప్రభుత్వం కుట్రపూరితంగా అలా చేసినట్టుగా భావించాల్సి ఉంటుందని ఆయన జోస్యం చెబుతున్నారు.

నిజానికి పింఛను లబ్ధిదారులకు ఎలాంటి కష్ట నష్టాలు ఉండకుండా.. వారి ఇంటి వద్దకే ఒకటో తేదీ నాడే పింఛను అందించేలా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన అద్భుతమైన ఏర్పాటు వాలంటీర్ల వ్యవస్థ. వాలంటీర్ల ద్వారా పింఛను లబ్ధిదారులు అందరూ తమకు దూరమైపోతారేమో అని చంద్రబాబు భయపడ్డారు.

అందుకే కుట్రపూరితంగా తనకు అనుకూలంగా ఉండే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఫిర్యాదు చేయించి.. వాలంటీర్లు పింఛన్ల పంపిణీకి దూరమయ్యేలా చేశారు. ఫలితం.. వృద్ధులు రోడ్డున పడాల్సి వచ్చింది. పదుల సంఖ్యలో పండు ముసలులు రాలిపోయారు. చంద్రబాబు పాపాన్ని రాష్ట్రం మొత్తం తిట్టిపోసింది. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతుందనే భయంతో ఉన్న చంద్రబాబు.. ఈసీ కి లేఖ రాయడం ద్వారా చేతులు దులిపేసుకోవాలని అనుకుంటున్నారు. లేఖ రాసినంత మాత్రాన వృద్ధుల ఉసురు చంద్రబాబుకు తగలకుండా ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.