దేశంలోని మహానగరాల్లో ప్రభాస్ సలార్, షారూక్ ఖాన్ డుంకీల మధ్యన గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాల్లో షారూక్ ఖాన్ సినిమా ఒక రోజు ముందు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది ఈ సినిమాకు అడ్వాంటేజ్ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి.
ఐటీ ఉద్యోగులు, సిటీ బర్డ్స్ ఇప్పటికే ఇయర్ ఎండ్, క్రిస్మస్, లాంగ్ వీకెండ్ ల మూడ్ లోకి వెళ్లిపోయారు. ఇలాంటి నేపథ్యంలో.. గురువారమే షారూక్ సినిమా విడుదల అవుతోంది. దీంతో దీనికి లాంగ్ వీకెండ్ రన్ లభించినట్టే!
ప్రభాస్ సినిమాకు శుక్ర, శని, ఆది, సోమ వారాల అవకాశం ఉంది. షారూక్ సినిమాకు గురువారమే తలుపులు తెరుచుకుంటున్నాయి. తొలి రోజున డుంకీ కనీసం 35 కోట్ల రూపాయలకు మించి ఎంత వసూళు సాధించినా దానికి అది మంచిదే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నాన్ హాలిడే రోజున షారూక్ సినిమా 35 కోట్లకు మించి ఎంత వసూలు చేసినా ఆ తర్వాత పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ వీకెండ్ లో భారీగా పుంజుకునే అవకాశాలున్నాయని అంచనా. తొలి రోజున షారూక్ సినిమా 50 కోట్ల రూపాయల వరకూ వసూళ్లను సాధించవచ్చనే అంచనాల నేపథ్యంలో, 35 కోట్లు దక్కినా చాలనే అభిప్రాయాలు ట్రేడ్ లో వినిపిస్తున్నాయి.
ఇక మరో గమనించాల్సిన అంశం ఏమిటంటే.. మహానగరాల్లో సలార్ తో పోలిస్తే డుంకీ టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి! హైదరాబాద్, బెంగళూరు వంటి చోట ఆన్ లైన్ బుకింగ్స్ లో సలార్ టికెట్ రేట్లు మినిమం 500లకు పైనే ఉన్నాయి. ఆరు వందల యాభై, తొమ్మిది వందల రూపాయల రేటుతో చాలా చోట్ల ఆన్ లైన్ బుకింగ్స్ నడుస్తున్నాయి. అయితే డుంకీతో అలాంటి ఇబ్బంది లేదు.
మల్లీప్లెక్స్ లలో ఈ సినిమా టికెట్ రేట్లు 190 రూపాయలతోనే మొదలవుతున్నాయి. రెక్లైనర్ సీట్లను మినహాయిస్తే గరిష్టంగా 250 రూపాయల స్థాయిలో డుంకీ టికెట్ల ధర ఉంది. మరి ప్రభాస్ సినిమాతో పోలిస్తే షారూక్ సినిమా టికెట్ రేట్లు తక్కువ ధరకు లభించడం చిన్నతనం ఏమీ కాదు. హైప్ ను క్యాష్ చేసుకుంటూ ఐనకాడికి వసూలు చేసుకోవడం కన్నా .. సవ్యమైన ధరల్లో ఆదరణను పొందడమే ఎవరికైనా నిజమైన హీరోయిజం అవుతుంది!