సంక్రాంతి సినిమాల నిర్మాతలు సై అంటే సై అంటున్నారు. బాక్సాఫీస్ బరిలో పోటీకి రెడీ అంటూ కాలుదువ్వుతున్నారు. ఎవరికివారు తగ్గేదేలే అంటూ సవాల్ విసురుతున్నారు. వీళ్లలో ఇద్దరు తగ్గితే బాగుంటుందేది ఫిలిం ఛాంబర్ భావన. కనీసం ఒక్కరైనా తగ్గితే మంచిదని భావిస్తున్నాడు అధ్యక్షుడు దిల్ రాజు.
కానీ పరిస్థితులు దిల్ రాజు అనుకున్నంత సానుకూలంగా కనిపించడం లేదు. సంక్రాంతి సినిమాల నిర్మాతలతో దిల్ రాజు ఏర్పాటుచేసిన తొలి మీటింగ్ విఫలమైంది.
నా సామిరంగ నిర్మాత శ్రీనివాస్, గుంటూరుకారం నిర్మాత నాగవంశీ, ఈగల్ నిర్మాత విశ్వప్రసాద్.. దిల్ రాజు సమక్షంలో సమావేశమయ్యారు. హను-మాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి హాజరుకాలేదు. ఈ సమావేశంలో తాము ముందుగా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశామంటే, కాదు మేం ముందుగా ప్రకటించామంటూ నిర్మాతలు వాదించుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తగ్గితే తమ హీరో ముందు మాట పడాల్సి వస్తుందని నిర్మాతలంతా ఎవరికివారే సేమ్ వాదన వినిపించినట్టు సమాచారం. మొత్తమ్మీద తాజా సమావేశంతో నిర్మాతలెవ్వరూ తగ్గే ఆలోచనలో లేరనే విషయం స్పష్టమైంది.
ఓ వారం రోజుల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామంటూ దిల్ రాజు ప్రకటించి, సమావేశాన్ని ముగించారు.
గుంటూరుకారం, సైంధవ్ తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకంటే, సంక్రాంతికి గుంటూరుకారం ప్రైమ్ మూవీ. సైంధవ్ సినిమా వ్యవహారాలు సురేష్ బాబు చూసుకుంటున్నారు కాబట్టి ఎవ్వరూ నో చెప్పలేరు. ఇక మిగిలింది ఈగల్, హను-మాన్, నా సామిరంగ మాత్రమే. వీటిలో ఈగల్ సినిమా అగ్రిమెంట్లు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంది.
హను-మాన్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ మిస్సవుతుందని భయపడుతోంది. ఇప్పటికే చాలా డిలే అయిందని, అగ్రిమెంట్లు పూర్తయ్యాయని, విడుదల వాయిదా వేస్తే ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తోందని వాదిస్తోంది. చిట్టూరి మాత్రం నాగ్ తో మాట పడాల్సి వస్తుందని అంటున్నారు.