సాధారణంగా స్టార్ హీరోలు మల్టీస్టారర్స్ ఎందుకు అంగీకరించరు? ఎందుకంటే, పక్కనున్న హీరోతో పోల్చితే, తమ స్థాయి, ఎలివేషన్లు ఎక్కడ పడిపోతాయో అనే భయం. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు తారక్ ఫ్యాన్స్, చరణ్ అభిమానులు చేసిన హంగామా ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడిదంతా ఎందుకంటే, సలార్ రిలీజైంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో పృధ్వీరాజ్ రూపంలో మరో స్టార్ కూడా ఉన్నాడు. నిజానికి టాలీవుడ్ జనాలకు ఇది మల్టీస్టారర్ కాదు. ఎందుకంటే, పృధ్వీరాజ్ స్టార్ డమ్ టాలీవుడ్ జనాలకు అక్కర్లేదు. కానీ దర్శకుడు ఇలా ఫీల్ అవ్వలేదు.
సలార్ సినిమాలో పృధ్వీరాజ్ పై కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీశాడు ప్రశాంత్ నీల్. అక్కడితో ఆగలేదు. ఆ సన్నివేశాలకు ప్రభాస్ తో చప్పట్లు కొట్టించాడు. ఆ వెంటనే మరో సీన్ లో ప్రభాస్ తో ఏకంగా విజిల్ వేయించాడు.
అక్కడ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఎలాంటి భేషజాలకు పోకుండా ఆ సన్నివేశాల్లో నటించాడు. మరో హీరో అయితే అలా నటిస్తాడా అంటూ టాలీవుడ్ లో ఇప్పుడో కొత్త చర్చ మొదలైంది.
సలార్ లోని ఓ సన్నివేశంలో ప్రభాస్, ఏకంగా ఓ నటుడి కాళ్లు పట్టుకుంటాడు. మరి మరో టాలీవుడ్ స్టార్ అయితే ఆ పని చేస్తాడా? సలార్ సినిమా ఫస్టాఫ్ లో ప్రభాస్ పట్టుమని 10 డైలాగ్స్ కూడా చెప్పలేదు. మాస్ డైలాగ్స్ కోరుకునే మరో స్టార్ అందుకు ఒప్పుకుంటాడా?
ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ మంచితనం పై ఓ రేంజ్ లో డిస్కషన్ నడుస్తోంది. ఈ సందర్భంగా కొంతమంది హీరోల పేర్లు, వాళ్లు చేసిన పనులు కూడా చర్చకొస్తున్నాయి.