తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే అంశంపై తన దగ్గర ఎలాంటి లిస్ట్ లేదంటోంది హీరోయిన్ కృతి సనన్. ఆ మాటకొస్తే, తన జీవితంలోకి వచ్చే పురుషుడిపై తనకు ఎలాంటి అంచనాల్లేవని కూడా చెబుతోంది. అంచనాలు పెట్టుకుంటే, ఒత్తిడి పెరుగుతుందని, అందుకే సింపుల్ గా ఉంటున్నానని తెలిపింది.
"వాస్తవంలో బతికే వ్యక్తి కావాలి నాకు. నన్ను నవ్వించగలిగితే చాలు. గంటల తరబడి అతడితో మాట్లాడినా బోర్ కొట్టకూడదు. నన్ను, నా వృత్తిని గౌరవించేవాడై ఉండాలి. ఈ లక్షణాలుంటే చాలు."
ఇలా తన కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల్ని బయటపెట్టింది కృతి సనన్. సమాజంలో హోదా, డబ్బు లాంటివి తను పట్టించుకోనని, తన కంటే స్థాయిలో తక్కువగా ఉన్నప్పటికీ, పైన చెప్పిన క్వాలిటీస్ ఉంటే చాలని చెబుతోంది.
పరిశ్రమలో స్త్రీ-పురుష తారతమ్యంపై మరోసారి స్పందించింది కృతి సనన్. హీరోయిన్లతో పోలిస్తే, హీరోలకు 10 రెట్లు ఎక్కువగా పారితోషికం ఇస్తున్నారని.. నిజంగా కంటెంట్ లో అంత దమ్ము ఉండి, స్టార్ హీరో సినిమా అయితే అంత మొత్తం ఇవ్వొచ్చని, సాధారణ హీరోలకు కూడా రెట్టింపు మొత్తాలు ఇస్తున్నారని ఆరోపించింది.
పరిశ్రమలో పురుషాధిక్యత తగ్గాలంటోంది కృతి సనన్. హీరోలతో సమానంగా హీరోయిన్లకు కూడా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇలాంటి డిమాండ్స్ చేస్తే అవకాశాలు వస్తాయా..?