ఆ రెండు పత్రికలే 'దేశానికి' ఆక్సిజన్

తెలుగుదేశం పార్టీ ప్రచారం ఏమైనా సాగిస్తోందా అంటే… ఎక్కడికక్కడ లోకల్ అభ్యర్థులు వాళ్ల బాధ వాళ్లు పడుతున్నారు. ఈ వయసులో కూడా చంద్రబాబు కిందా మీదా అవుతున్నారు. పవన్ కు తప్పదు కనుక కుదిరిన ఒప్పందం మేరకు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ మాత్రం తను పోటీ చేస్తున్న మంగళగిరికే పూర్తిగా పరిమితం అయ్యారు. ఇక ఎవరున్నారు తెలుగుదేశం తరపున ప్రచారం సాగించడానికి?

సినిమా రంగానికి చెందిన మురళీమోహన్, రాఘవేంద్రరావు, అశ్వనీదత్ లాంటి సీనియర్లా? లేదా రాజకీయాల్లో పండిన అశోక్ గజపతి రాజు, అచ్చెన్నాయుడు, ఇటీవలే మరోసారి పార్టీలోకి వచ్చిన దాడి వీరభద్రరావు నా? నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేయగల నాయకుడు ఒకే ఒక్కరు. చంద్రబాబు త‌ప్పు మరొక్క నాయకుడు లేరు.

ఎందువల్ల ఇంతటి దీన పరిస్థితి. ఎందుకంటే పార్టీలో మరే నాయకుడిని రాష్ట్ర స్టాయి ఇమేజ్ తెచ్చుకునేలా చంద్రబాబు ఎదగనివ్వలేదు కనుక. ఎందరో హేమా హేమీలు తెలుగుదేశం పార్టీ నుంచి కేవలం చంద్రబాబు కారణంగా నిష్క్రమించారు. బయటకు వెళ్లి వాళ్లు చెప్పిందే.. చంద్రబాబు వల్లే బయటకు వచ్చామని. మిగిలినవన్నీ చాలా అంటే చాలా వరకు మరుగుజ్జు వృక్షాలే.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి స్టార్ కాంపైనర్లు ఆ రెండు తెలుగు పత్రికలే. తెల్లవారి లేచిన దగ్గర నుంచి వాటి అజెండా ఒక్కటే. వెదికిన కోణం వెదకకుండా జగన్ మీద నెగిటివ్ వార్తలు వండి వార్చడం. నిజానికి ఆ పత్రిక అధిపతులకు కాదు సలాం కొట్టాల్సింది. అందులో పని చేసే జర్నలిస్ట్ లకు, రాసిందే అటు తిప్పి, ఇటు తిప్పి, రకరకాల కాన్సెప్ట్ లు ఆలోచించి, కథనాల మీద కథనాలు గడచిన అయిదు సంవత్సరాలుగా వండి వార్చడం అంటే మాటలు కాదు.

వైఎస్ జమానాలో ఇదే చేసారు. జగన్ తొలిసారి పార్టీ పెట్టి, పోటీకి దిగినపుడు ఇదే చేసారు. 2019లో డిటో.. ఇప్పుడు 2024లో డిటో.. డిటో. ఈ రెండు పత్రికలు కనుక లేకపోతే తెలుగుదేశం పరిస్థితి అనాధ అయిపోతుంది. తెలంగాణలో ఈ రెండు పత్రికల నోళ్లు కేసీఆర్ మూయించినంత కాలం చంద్రబాబు తన పార్టీ ని మూసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఈ రెండు పత్రికలు తెలంగాణలో తెలుగుదేశాన్ని భుజనా వేసుకోవడం లేదు.

అందుకే తెలుగుదేశం పార్టీకి మిగిలిన స్టార్ కాంపైనర్లు ఆ రెండు పత్రికలే. అవి కనుక ఒక్కసారి సైలంట్ అయిపోతే తెలుగుదేశం పార్టీ మాటను జనాలను వినిపించేది ఎవ్వరూ వుండరు. ఇది చంద్రబాబు కోరి చేసుకున్న పరిస్థితి. ఆ రెండు పత్రికలు అస్త్ర సన్యాసం చేసినా, చేయించినా అది తెలుగుదేశం పార్టీకి అంతిమ ఘడియలు స్టార్ట్ కావడానికి దారి తీస్తుంది.

Show comments